హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మందికిపైగా మృతి చెందినట్టు అధికారుల ధ్రువీకరించారు. మృతుల్లో విద్యార్థులూ ఉన్నారు. జంగ్లా గ్రామంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో బస్సు లోయలో పడినట్టు కుల్లు డిప్యుటీ కమిషనర్ అశుతోష్ గర్గ్ వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనతో ప్రధాని నరేంద్ర మోదీదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి పీఎమ్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. గాయపడ్డ వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా ట్వీట్ ద్వారా మృతుల కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్రపతి రామ్‌నాత్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ట్విటర్‌లో స్పందించారు.