Weather Updates: వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, అధిక వర్షపాతానికి దారి తీస్తున్నాయి. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటం.. అనుహ్య వాతావరణ పరిణామాలకు దారితీస్తుంది. సముద్ర జలాలపై అధిక వేడి కారణంగా.. అల్పపీడనాలు కొన్ని రోజుల్లోనే వాయుగుండాలుగా మారుతున్నట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాయుగుండాలు తుపాన్లుగా మారుతున్నాయని, వీటి వల్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తూ అల్లకల్లోలం చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.


గత 40 ఏళ్లలో నెలవారీగా పరిశీలిస్తే 2023 ఏప్రిల్ లో సముద్రజలాల సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా 21 డిగ్రీలు దాటినట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో ఎల్నినో ఏర్పడి జూన్ నెలలో నైరుతి రుతు పనాలు ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే జూన్ లో పెద్ద వర్షాలు నమోదు కాలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జులై నుంచి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. కొన్ని నెలల పాటు కురవాల్సిన వర్షాలు కేవలం గంటల వ్యవధిలో కుమ్మరిస్తున్నాయి. దీని వల్ల ఉన్నట్టుండి కొన్ని గంటల వ్యవధిలో వరదలు పొంగుకురావడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం జరుగుతోంది. ఈ వాతావరణ మార్పుల కారణంగానే.. కొన్ని రోజుల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో భీకరమైన వర్షాలు పడ్డాయి. 


మూడు, నాలుగు రోజుల్లో తుపాను


గతంలో అల్పపీడనం ఏర్పడి అది తుపానుగా మారేందుకు వారం రోజులకు పైగా సమయం పట్టేది. కానీ సముద్రజలాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఈ నెల 24వ తేదీన బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఒక్కరోజులోనే తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో మూడు, నాలుగు రోజుల్లోనే అల్పపీడనాలు తుపాన్లుగా మారి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు. 


Also Read: Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలు - నేడు మోస్తరు, రేపు భారీ వర్షాలు


వేల్పూర్ లో 24 గంటల్లో 46.3 సెంటీమీటర్ల వర్షం


గత సోమవారం రోజు ఉదయం 8.30 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 8.30 గంటలకల్లా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఏకంగా 46.3 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. ఇంతటి కుంభవృష్టి నమోదు కావడం చాలా అరుదు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 22.2 నుంచి 46.3 సెంటీమీటర్ల వర్షపాతం  నమోదు అయింది. మరుసటి రోజు బుధం వారం ఉదయం నుంచి సాయంత్రానికల్లా అంటే కేవలం 11 గంటల వ్యవధిలో 14 ప్రాంతాల్లో 10 - 20 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొద్దిగంటల వ్యవధిలోనే 5 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం తరచూ నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలోని విపరీత మార్పుల వల్లే ఇలా జరుగుతున్నట్లు వెల్లడిస్తున్నారు. 


ఈ ఏడాది మే 8వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కేవలం 2 రోజుల్లోనే తీవ్ర వాయుగుండంగా మారింది. ఆపై తీవ్ర తుపానుగా మారి మయన్మార్, బంగ్లాదేశ్ తీరాలను తాకింది. మే8 వ తేదీన అల్పపీడనం ఏర్పడినట్లు గుర్తించగా.. మే 14కల్లా గంటకు 280 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచే తుపానుగా పరిణమించింది. గాలుల వేగం ఊహించనంత స్థాయిలో పెరగడంతో 145 మంది వరకు మృత్యువాత పడ్డారు.