Layoffs in Reliance Industries | దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ‌ రిల‌యన్స్ ఇండ‌స్ట్రీస్ 42 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించింద‌నే వార్త ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఆ సంస్థ త‌న మొత్తం ఉద్యోగుల్లో 11 శాతం మందిని తీసేసిన‌ట్టు ఎక‌న‌మిక్ టైమ్స్ క‌థ‌నం సారాంశం. ఒకేసారి ఇంత‌మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డంపై వ్యాపార‌వేత్త అనుప‌మ్ మిట్ట‌ల్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇంత భారీ సంక్షోభం చోటుచేసుకున్నా బ‌య‌ట‌కి చిన్న లీక్ కూడా రాక‌పోవ‌డంపై ఆయ‌న ఆశ్య‌ర్య‌పోయారు. 


ముఖేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కూడా లేఆఫ్ బాట ప‌ట్టింది. 2023-24 నాటికి త‌మ ఉద్యోగుల‌ను 3.47 ల‌క్ష‌ల‌కు త‌గ్గించిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. గ‌తేడాది ఉద్యోగుల సంఖ్య 3.89 ల‌క్ష‌లుండ‌గా ఈ మేర‌కు కోత‌లు విధించిన‌ట్టు తెలుస్తోంది. దీంతోపాటు కొత్త ఉద్యోగ నియామ‌కాల్లోనూ పొదుపు సూత్రం పాటిస్తున్నారు. కంపెనీ వార్షిక నివేదిక ప్ర‌కారం నూత‌న నియామ‌కాలు 1.7 లక్ష‌ల మేర త‌గ్గాయి. మూడో వంతు మాత్ర‌మే కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న‌ట్టు ఎక‌న‌మిక్ టైమ్స్ క‌థ‌నం. 
 
పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని ఒక బిజినెస్ అన‌లిస్ట్ క‌థ‌నం ప్ర‌కారం.. డిజిట‌ల్ టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన కార‌ణంగా కొత్త వ్యాపారాల‌ను కూడా ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితోనే స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని పేర్కొన్నారు. 42 వేల మంది ఉద్యోగుల తొల‌గింపు గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుప‌మ్ మిట్ట‌ల్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇంత భారీగా లే ఆఫ్‌లు ప్ర‌క‌టిస్తే రాజకీయ‌, వ్యాపార వ‌ర్గాల్లో చిన్నప్ర‌చారం కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డం త‌న దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షించింద‌ని చెప్పుకొచ్చారు. 


అనుపమ్ మిట్టల్ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం ఉద్యోగాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పార్ట్ టైం, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ‌గా ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు. మ‌రో 1.7 ల‌క్ష‌ల మంది ఇతరులున్నారు. కానీ దీనిపై వ్యాపార‌, రాజ‌కీయ వ‌ర్గాలు నోరుమెద‌ప‌డం లేదు. దీనిని ఎవ‌రూ స‌మ‌స్య‌గానే చూడ‌టం లేద‌న్నారు. కాస్ట్ క‌టింగ్ పేరుతో ఉద్యోగాల నుంచి తీసివేస్తుంటే దేశ ఆర్థిక ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏటా 8 నుంచి 10 మిలియ‌న్ల కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది  పోయి ఉన్న‌వారిని తొల‌గించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. 



రిలయన్స్ సంస్థకు రిటైల్ విభాగంలో 2024లో 207,552 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఉద్యోగుల్లో 60 శాతం మంది రిటైల్ ఉద్యోగులే ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉద్యోగాల సంఖ్య 245,581గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగాల్లో కోత కారణంగా 207,552కి పడిపోయింది. రిలయన్స్ జియోలో కూడా చాలా మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించేశారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియోలో 95,326గా ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2024 ఆర్థిక సంవత్సరానికి వ‌చ్చేస‌రికి ఈ సంఖ్య 90,067కి తగ్గిపోయింది. 


ఆదాయం ఆశించినంతగా లేకపోవడమే ఉద్యోగుల తొలగింపు వెనుక కార‌ణంగా తెలుస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ త్రైమాసికంలో కేవలం 7 శాతం లాభాలను మాత్రమే రిలయన్స్ రిటైల్ పొంద‌గ‌లిగింది. ఇది ఆదాయ వృద్ధిలో 15 నుంచి 20 శాతానికి తగ్గుదలను సూచించిది. 2023లో తొలి త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ 740 స్టోర్స్ కొత్తగా ఏర్పాటు చేసింది. 2024 తొలి త్రైమాసికంలో మాత్రం కేవలం 82 కొత్త స్టోర్స్ను మాత్రమే ప్రారంభించ‌గ‌లిగింది. ఈ పరిణామాలే 42 వేల మంది ఉద్యోగుల తీసివేతకు కారణమయ్యాయి.