Rs. 1000 Notes Re Introduction: 


ఆ ఆలోచనే లేదు..


రూ.1000 నోట్లను మళ్లీ (Rs. 1000 Notes Re Introduction) మార్కెట్‌లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే..విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..RBI అలాంటి ఆలోచనే లేదని తెలుస్తోంది. రీ ఇంట్రడక్షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అసలు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంది RBI. ఇకపై ఈ నోట్లు చెలామణిలో ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. 2016లో మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే రూ.500తో పాటు రూ.1000 నోట్లూ రద్దైపోయాయి. రూ.1000 నోట్ల స్థానంలో రూ.2 వేల నోట్లు తీసుకొచ్చింది. ఆ తరవాత కొత్తగా రూ.500 నోట్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా రూ.1000 నోట్లు కూడా తీసుకొస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశ్వసనీయ వర్గాలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి.