ప్రేమించిన అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ, టీనేజర్లకు కీలక సూచనలు  చేసింది. న్యాయమూర్తులు చిత్త రంజన్‌దాస్‌, పార్థసారథి సేన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యుక్తవయస్సులో ఉన్న బాలికలు వారి లైంకిగ కోరికలను అదుపులో పెట్టుకోవాలని సూచించింది. బాలికలు వారి లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని తెలిపింది. అంతేకాదు, యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిలు కూడా యువతులు, మహిళలను గౌరవించాలని ధర్మాసనం సూచించింది.


బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు తేలింది. ప్రేమ సంబంధం కారణంగా బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా ఉన్న యువకుడిని కోల్‌కతా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. పరస్పర సమ్మతితో లైంగిక చర్యలో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టం పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. యుక్త వయస్సులోకి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్ట‌పూర్వ‌కంగా లైంగిక చ‌ర్య‌లో పాల్గొంటే ఆ కేసుల‌ను నేర‌ర‌హితం చేయాల‌ని కోర్టు తెలిపింది. అలాంటి స్థితిలో లైంగిక సంబంధాల ద్వారా క‌లిగే న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు.. లైంగిక విద్య‌ను అందించాల‌ని అభిప్రాయ‌ప‌డింది. లైంగిక‌ వాంఛలకు చెందిన కార‌ణాల‌ను కోర్టు త‌న తీర్పులో స‌వివ‌రంగా వెల్ల‌డించింది.


లైంగిక కోరికలు క‌ల‌డానికి మ‌న శ‌రీరంలోని పిట్యుట‌రీ గ్రంధి కీల‌క‌మైంద‌ని, అది టెస్టెస్ట‌రోన్ వంటి లైంగిక హార్మోన్ల‌ను రిలీజ్ చేస్తుంద‌ని, ఆ గ్రంధిని అదుపులో పెట్ట‌డం మ‌న చేతుల్లో ఉంద‌ని తెలిపింది కోర్టు. ఆ గ్రంధి ఆటోమెటిక్‌గా హార్మోన్ల‌ను రిలీజ్ చేయ‌దని... చూడ‌డం, విన‌డం, చ‌ద‌వ‌డం వంటి చ‌ర్య‌ల‌తో మ‌న‌లో లైంగిక కోరిక క‌లుగుతుంద‌ని తెలిపింది. అంటే సొంత చ‌ర్య‌ల వ‌ల్లే మ‌న‌లో కోర్కెలు క‌లుగుతున్నాయ‌ని, అందుకే ఆ కోర్కెల‌ను అదుపులో పెట్టుకోవాల‌ని తీర్పులో పేర్కొంది. కౌమారదశలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండాల‌న్న దానిపై కూడా త‌న తీర్పులో వివరించింది.


యువతకు సూచనలు 


అబ్బాయిలు, అమ్మాయిలకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. టీనేజ్‌లో అమ్మాయిలకు లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయని.. అయితే, రెండు నిమిషాల ఆనందం కోసం లొంగిపోతే సమాజంలో విలువలు కోల్పోతారన్నది తెలుసుకోవాలని చెప్పింది. యుక్తవయసులో ఉన్న అబ్బాయిలూ, యువతి, స్త్రీ విధులను గౌరవించాలని, స్త్రీ విలువలు, గౌరవాన్ని రక్షించాలని సూచించింది. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులే పిల్లలకు తొలి ఉపాధ్యాయులుగా ఉండాలని చెప్పింది. మంచి చెడుల గురించి చెప్పాలని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గురించి వివరించాలని స్పష్టం చేసింది. మహిళలను ఎలా గౌరవించాలో మగపిల్లలకు తల్లిదండ్రులే చెప్పాలంది కోర్టు. లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా మహిళలతో స్నేహం ఎలా చేయాలో నేర్పించాలని సూచించింది.