Indian currency: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏం లేదని ఆర్‌బీఐ ప్రకటించింది.
భారతీయ కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని, ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఇలా వార్తలు
త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలను కొత్త నోట్లపై ముద్రిస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. కొత్తగా ఆర్‌బీఐ విడుదల చేయనున్న కొన్ని డినామినేషన్ బ్యాంకు నోట్లపై ఈ ఇద్దరి ఫొటోలను ముద్రించాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
వీరి ఫొటోలను కొన్ని డినామినేషన్ నోట్లపై మాత్రమే ముద్రించనున్నారని, మహాత్మా గాంధీ ఫొటోలతో కూడా ఇప్పటిలానే కరెన్సీ చలామణి అవుతుందని ఈ కథనాల్లో ఉంది. కరెన్సీ నోట్లపై ప్రముఖల ఫొటోలను ముద్రించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను, అవకాశాలను అన్వేషిస్తున్నామని, ఆ అన్వేషణలో భాగంగానే ఈ యోచన చేస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొన్నట్లు ఈ వార్తలు తెలిపాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న భారతీయ కరెన్సీ, నోట్లలో ఎలాంటి మార్పులు చేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని, ఇలాంటివి కేవలం ఊహాగానాలేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
Also Read: Russia–Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి 100 రోజులు- భారత్ ఎంత నష్టపోయిందో తెలుసా?
Also Read: Prophet Muhammad Row: 'ముందు మీ పని చూసుకోండి'- పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్