Ayodhya Ram Mandir Inauguration: ఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట ఈవెంట్ ను వైభవంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. మరోవైపు ప్రముఖ వేడుకను టార్గెట్ గా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో భక్తులను మోసం చేస్తున్నట్లు పలు రాష్ట్రాల్లో పోలీసులు గుర్తించారు. దాంతో కేంద్రం అప్రమత్తమైంది. అయోధ్యలో రామ మందిరం వేడుకకు సంబంధించి ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురించకూడదని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా, శాటిలైట్ న్యూస్ ఛానెల్స్, డిజిటల్ మీడియా, ఇతర న్యూస్ పబ్లిషర్లకు శనివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.






అలాంటి కంటెంట్ ప్రసారం చేయవద్దు.. 
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 22 జనవరి 2024 న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు ధ్రువీకరించని వార్తల్ని ప్రచురించవద్దు అని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ తన ఆదేశాలలో పేర్కొంది. రెచ్చగొట్టే వార్తలు, మత విద్వేషాలు, ఫేక్ న్యూస్ లాంటి విషయాలు పబ్లిష్ చేయవద్దని, శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం చేయకూడదని హెచ్చరించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల నియంత్రణ చట్టం మీడియా నియమావళి ప్రకారం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్‌ను నిషేధిస్తుంది. అయోధ్య వేడుక సందర్భంగా మీడియా సంస్థలు కచ్చితమైన సమాచారం, ధ్రువీకరించిన సమాచారం మాత్రమే ప్రచురించాలని సూచించింది. 


ధ్రువీకరించని వార్తలు, ఆధారాలు లేని విషయాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయవద్దని ఆదేశాలలో కేంద్రం హెచ్చరించింది. రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని, కుల, మతాల మధ్య విధ్వేషం చెలరేగే అంశాలను ప్రచురించకూడదు. కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి వార్తలను టెలికాస్ట్ చేస్తే సంబంధిత మీడియా అందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని, చర్యలు తీసుకుంటామని ఆదేశాలలో పేర్కొన్నారు.