Ram Mandir Inauguration: చరిత్రాత్మక ఘట్టానికి మరొకొన్ని గంటలే ఉన్నాయి. అందరి అడుగులు అయోధ్యలోని రామమందిరంవైపు వడివడిగా పడుతున్నాయి. ఒక్క అయోధ్య మాత్రమే కాదు.. దేశం మొత్తం రాముని నామస్మరణతో మారుమోగిపోతోంది. ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న బాలరాముడిని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు రాములోరి గుడి తలుపుకు తాళం వచ్చేసింది. తాళం అంటే సాదాసీద తాళం కాదు.. 400 కేజీల తాళం. అదికూడా ఒక కళాకారుడు చేత్తో తయారు చేశాడు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్యపురికి చేరుకుంది. 


చేతితో తయారు చేసిన అతిపెద్ద తాళం.. 


రాములోరి గుడికి తయారు చేసిన తాళం ఏకంగా 400 కేజీలు. దీన్ని అయోధ్యలోని రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ శర్మ తయారు చేశారు. సత్యప్రకాశ్‌ శర్మ చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. శ్రీరాముడికి ఆయన పరమ భక్తుడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అయోధ్య రాముడి గుడికి ప్రత్యేకంగా ఈ తాళాన్ని తయారు చేశారు. కాగా.. సత్యప్రకాశ్‌ భార్య రుక్మిణి కూడా తాళం తయారీలో సాయం చేశారు. ఇక వాళ్ల కుటుంబం కొన్ని తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతోంది.  


10 అడుగుల ఎత్తు.. 


ఇక ఈ తాళం ప్రత్యేకతలు చూస్తే.. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో దీన్ని రూపొందించారు. ఇక దీని పొడవు నాలుగు అడుగులు. ఈ తాళం తయారు చేసేందుకు 2లక్షలు ఖర్చు అయినట్లు సత్యప్రకాశ్‌ గతంలో చెప్పారు. ఇక దీన్ని గతంలో అలీఘడ్‌లోని ఎగ్జిబిషన్‌లో కూడా ఉంచారు. ఇక ఇప్పుడు ఆ తాళం అయోధ్య చేరుకుంది. 






 


1256 కిలోల ప్రత్యేక లడ్డు


ఇక అంతేకాకుండా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు ప్రత్యేకంగా.. 1256 కేజీల లడ్డును కానుకగా ఇచ్చాడు ఒక భక్తుడు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 1256 రోజులు పూర్తైన సందర్భంగా 1256 కేజీల ప్రత్యేక లడ్డును అయోధ్యకు చేర్చారు.    






 


అయోధ్యలో నిర్మితమైన రామమందిరానికి దేశం నలుమూలల నుంచి అనేక వస్తువులు వచ్చాయి. రామమందిరానికి సంబంధించిన తలుపులు హైదరాబాద్‌కి చెందిన వారే తయారు చేయగా.. రాములోరికి బంగారు పాదాలు కూడా మన హైదరాబాద్‌ నుంచే వెళ్లాయి. ఇక దేశంలోని నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠాపనను దేశంలోని ప్రజలంతా తమ ఇంట్లో ప్రత్యేక పండుగులాగా జరుపుకుంటున్నారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అయోధ్యలో ఆరోజు భక్తుల తాకిడీ, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఎవ్వరినీ రావొద్దని రామ్‌తీర్థ బోర్డు ప్రకటిచింది. ఈ నేపథ్యంలోనే వెళ్లలేని వాళ్లకోసం PVR INOX అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రదర్శించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 160 స్క్రీన్‌లలో లైవ్‌ టెలికాస్ట్ చేయనుంది.జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్‌డే సెలవు ప్రకటించింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. కొన్ని చోట్ల డ్రై డే పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 22న హాఫ్‌ డే సెలవు ప్రకటించాయి.