Ram Mandir Inauguration: ఢిల్లీలోని Babar Road సైన్‌ బోర్డ్‌లపై ఉన్నట్టుండి Ayodhya Marg అనే పోస్టర్లు వెలిశాయి. బాబర్ రోడ్‌ అనే పేరు కనిపించకుండా వాటిపై ఈ పోస్టర్లు అంటించింది  హిందూ సేన. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని తొలగించారు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి ముందు ఇలా జరగడం స్థానికంగా అలజడి సృష్టించింది. ఆ రోడ్ పేరుని మార్చేయాలన్న ఉద్దేశంతోనే హిందూసేన ఇలా పోస్టర్లు అంటించినట్టు తెలుస్తోంది. పరోక్షంగా ప్రభుత్వానికి ఇలా సంకేతాలిచ్చింది. 


 






ముమ్మరంగా ఏర్పాట్లు..


జనవరి 22న అయోధ్యలో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఇప్పటికే నగరం అందుకు సిద్ధమవుతోంది. అన్ని ఏర్పాట్లూ పూర్తవుతున్నాయి. అతిథులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు దాదాపు 8 వేల మంది అతిథులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. వేలాది మంది సంతులు, సాధువులు అయోధ్యకి తరలి వస్తున్నారు. జనవరి 23 నుంచి అయోధ్య రాముడి ఆలయం సాధారణ ప్రజల సందర్శనకు తెరుచుకోనుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఆలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లను సమీక్షించారు. భద్రతపై ఆరా తీశారు. VIPలు వస్తున్నందున భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు యోగి. అటు కేంద్ర ప్రభుత్వం అయోధ్య ఉత్సవం నేపథ్యంలో ఓ నిర్ణయం తీసుకుంది. జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్‌డే సెలవు ప్రకటించింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. కొన్ని చోట్ల డ్రై డే పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 22న హాఫ్‌ డే సెలవు ప్రకటించాయి. PVR INOX అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రదర్శించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 160 స్క్రీన్‌లలో లైవ్‌ టెలికాస్ట్ చేయనుంది.


ఢిల్లీలోని ఔరంగజేబు లేన్  (Aurangzeb Lane)పేరు మార్చుతూ గతేడాది నిర్ణయం తీసుకుంది న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NMDC). ఔరంగజేబు పేరు తీసేసి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం  (Dr APJ Abdul Kalam Lane)పేరు పెట్టింది. ఇటీవలే సమావేశమైన ఈ కౌన్సిల్ సభ్యులు..పేరు మార్పునకి ఆమోదం తెలిపారు. అబ్దుల్ కలాం రోడ్‌కి, ఔరంగజేబు లేన్‌కి కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఔరంగజేబు లేన్ పేరు తీసేయడం వల్ల నేరుగా అబ్దుల్ కలాం రోడ్‌కి, అబ్దుల్ కలాం లేన్‌కి కనెక్ట్ చేసినట్టైంది. 2015లోనే ఔరంగజేబు రోడ్‌ పేరుని అబ్దుల్ కలాం పేరిట మార్చింది NMDC. ఇప్పుడు లేన్‌ పేరు కూడా మార్చేసింది. 2015లోనే ఔరంగజేబు రోడ్డు పేరు మార్చినప్పుడు ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. చరిత్రను చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నారని మండి పడ్డాయి. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగదని తేల్చి చెబుతున్నారు కొందరు అధికారులు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఔరంగాబాద్ జిల్లా పేరు మార్చేస్తానని ప్రకటించింది. 


Also Read: Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ రోజున బిజీబిజీగా ప్రధాని మోదీ, అయోధ్య షెడ్యూల్‌ పూర్తి వివరాలివే