Ramlala Pran Pratishtha: జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు ఆ రోజు ప్రధాని షెడ్యూల్‌ని అధికారికంగా వెల్లడించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ఆయన పూజకు హాజరవుతారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైన తరవాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆ తరవాత మధ్యాహ్నం 1 గంటకు ఓ పబ్లిక్ మీటింగ్‌కి హాజరవుతారు. 2.15 నిముషాలకు కుబేర్ తిలలోని శివాలయాన్ని సందర్శిస్తారు. ఉదయం 10.25 నిముషాలకు ప్రధాని మోదీ అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. రామజన్మభూమి ఆలయానికి 10.55 నిముషాలకు చేరుకుంటారు. 11 నుంచి 12 గంటల వరకూ అక్కడే ఉంటారు. 12.05 నిముషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. 12.55 నిముషాల వరకూ ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మోదీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సభలోనే ఉంటారు. ఈ సమయంలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలోనే ఆయన అయోధ్యకి సంబంధించి మరి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. 


పూర్తి షెడ్యూల్ ఇదే..


10.25 నిముషాలకు అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు


10.55 నిముషాలకు అయోధ్య ఆలయానికి వస్తారు.


11-12 గంటల వరకూ ఆలయంలోనే ఉంటారు. 


12.05 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. 


12.55 గంటల వరకూ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కొనసాగుతుంది. 


ఆ తరవాత పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు


1-2 గంటల మధ్యలో బహిరంగ సభలో హాజరు


2 గంటలకు కుబేర్‌ తిలలో శివాలయ సందర్శన 


గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అదే తరహాలో ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడులకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేలా పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. జనవరి 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మహాక్రతువును బిగ్ స్క్రీన్‌పై చూడొచ్చు. అయితే ఇందుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ ఉచితంగా అందిస్తున్నారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్‌ సైట్, బుక్‌ మై షోలోనూ అయోధ్య రాముడి పండగ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా మాట్లాడుతూ.. ‘ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెల్లడించింది. ప్రాణప్రతిష్ట మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. మరికొందరు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు లైవ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.


Also Read: ధగధగ మెరిసిపోతున్న అయోధ్య ఆలయం, ఎంత అందంగా అలంకరించారో చూడండి