Sania Mirza and Shoaib Malik News:అనుమానాలను నిజం చేస్తూ... స్టార్ కపుల్ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ జోడీ విడిపోయింది. కొన్నేళ్లుగా షికార్లు చేస్తున్న పుకార్లు నిజమేనని రుజువైంది. సానియాతో 14 ఏళ్ల పెళ్లి బంధానికి షోయబ్ వీడ్కోలు పలికాడు. సానియా మీర్జాతో విడిపోతున్నట్లు వచ్చిన వార్తలను వాస్తవమేనని రుజువు చేస్తూ... పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. నటి సనా జావెద్‌తో ఉన్న ఫొటోలను షోయబ్ మాలిక్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత ఏడాది సనా జావెద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత షోయబ్ మాలిక్... సనా జావెద్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇటు షోయబ్ మాలిక్ కానీ... అటు సనా కానీ ఎవరూ ఖండించలేదు. అప్పటినుంచే షోయబ్ మాలిక్- సానియా విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు చాలా కాలంగా సనా జావేద్ తెలుసని.. ఆమెతో చాలాసార్లు పని చేసే అవకాశం వచ్చిందని... సనా తన పక్కనున్న వ్యక్తులతో చాలా దయగా మర్యాదగా ఉంటుందని షోయబ్ మాలిక్ తెలిపాడు.
సానియా వేదాంతంతో అనుమానాలకు బలం
" వివాహం చేసుకోవడం కష్టం. విడాకులు తీసుకోవడం ఇంకా కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి" అంటూ సానియా షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీతో మళ్లీ విడాకుల గురించి చర్చ మొదలైంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మీరు చేసుకునే ఎంపికను బట్టి జీవితం ఉంటుందంటూ సానియా ఆ పోస్ట్‌లో షేర్ చేసింది. సానియా షేర్ చేసిన ఈ స్టోరీ క్షణాల్లో వైరల్‌గా మారింది. భర్త షోయబ్ మాలిక్‌తో సానియా విడిపోతోందని... అందుకే ఇలా పోస్ట్ చేసిందన్న ఊహాగానాలు చెలరేగాయి.
2010లో ప్రేమ వివాహం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో షోయబ్ మాలిక్ సైతం ట్విటర్ అకౌంట్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా నేమ్‌ను తీసేశాడు. తాజాగా సానియా తన ఇన్‌స్టా నుంచి షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో సానియా- షోయబ్ త్వరలోనే డివోర్స్ తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.
గతంలోనూ...
సానియా మీర్జా -షోయబ్ మాలిక్ సంసార జీవితం గురించి అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. భర్త షోయబ్ మాలిక్‌తో సానియా విడిపోయిందని.. వీరి మధ్య అంత సఖ్యత లేదనే పుకార్లు సోషల్ మీడియాలో చాలాకాలంగా వైరల్ అవుతున్నాయి. సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే ఈ పుకార్లపై వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడింది లేదు. సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించింది. అటు షోయబ్ మాలిక్ సైతం ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భార్య సానియా మీర్జా పేరును తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమంటూ నెటిజన్లు అప్పట్లో వార్తలు చెలరేగాయి. ఈ జంట ఒకరి గురించి ఒకరు పోస్ట్ చేసి చాలా కాలం అయ్యింది. దాంతో ఈ జంట విడాకుల ఊహాగానాలను మరింత పెంచినట్టైంది. ఇప్పుడు ఈ ఊహాగానాలే నిజమయ్యాయి.