పాకిస్థాన్ జట్టు(Pakistan cricket team)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారత్(India) వేదికగా జరిగిన ప్రపంచ కప్(World Cup)లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చేయగా.. తాజాగా కీలక పదవుల నుంచి మిక్కీ ఆర్థర్(Mickey Arthur), గ్రాంట్ బ్రాడ్ బర్న్(Grant Bradburn), ఆండ్రూ పుట్టిక్( Andrew Puttick) నుంచి వైదొలిగారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరు రాజీనామా చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. ప్రపంచకప్‌లో పాక్ క్రికెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మికీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్ రాజీనామా చేశారు. పీసీబీ వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో మికీ ఆర్థర్ పాక్ క్రికెట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. బ్రాడ్‌బర్న్‌ను ప్రధాన కోచ్, పుట్టిక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా పీసీబీ నియమించింది. వరల్డ్ కప్‌లో జట్టు దారుణంగా ఆడటంతో ఈ ముగ్గురూ కొనసాగేందుకు ఇష్టపడక రాజీనామాలు సమర్పించేశారు. వీటిని పీసీబీ ఆమోదించింది.
అసలు ఏం జరుగుతోంది..?
గతేడాది ఆసియా కప్ నుంచి పాక్ జట్టుకు ఏదీ కలసి రావడం లేదు. ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన పాకిస్థాన్... భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి తుస్సుమంది. సెమీఫైనల్ చేరకుండానే మెగా టోర్నీ నుంచి అవమానకర రీతిలో బయటకు వచ్చేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లతో పాటు ఆఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్టు చేతిలోనూ ఓడి తీవ్ర విమర్శల్ని మూటగట్టుకుంది. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. అయినా పరాజయాల పరంపర కొనసాగుతోంది.
మూడేళ్ల బంధానికి ముగింపు
2016 నుంచి 2019 మధ్య పాకిస్థాన్ జట్టుకు మిక్కీ ఆర్థర్ కోచ్ గా పని చేశాడు. ఏప్రిల్ 2023లో పాక్ జట్టులో డైరెక్టర్‌గా చేరారు. ఆర్థర్ 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఇతను కోచ్ గా ఉన్న సమయంలో పాకిస్తాన్ ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆర్థర్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు. 57 ఏళ్ల బ్రాడ్‌బర్న్ 1990 నుండి 2001 వరకు 18 అంతర్జాతీయ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ తరపున మ్యాచ్ లాడాడు. NCAలో హై-పెర్ఫార్మెన్స్ కోచింగ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టే ముందు వరకు 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ మెన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ పుట్టిక్ ఏప్రిల్ 2023 నుండి పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జకా అష్రాఫ్ తన పదవి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.