దక్షిణాఫ్రికా గడ్డపై ప్రారంభమైన అండర్‌ 19 ప్రపంచకప్‌(ICC Under 19 World Cup)లో యువ భారత్‌(India) నేటి నుంచి టైటిల్‌ వేట ప్రారంభించనుంది. 15వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతున్న భారత్‌... తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. అయిదు సార్లు విజేతగా నిలిచిన భారత్‌ ఆరోసారి ప్రపంచకప్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. శనివారం గ్రూపు-ఎలో బంగ్లాదేశ్‌(India vs Bangladesh)తో మ్యాచ్‌తో అండర్‌-19 ప్రపంచకప్‌ పోరాటానికి భారత్‌ శ్రీకారం చుట్టనుంది. ఉదయ్‌ సహరన్‌ నేతృత్వంలో బరిలో దిగనున్న భారత్‌... తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని చూస్తోంది. కెప్టెన్‌ సహరన్‌తో పాటు ఆల్‌రౌండర్‌ అర్షిన్‌ కులకర్ణి, వికెట్‌ కీపర్‌ అరవెల్లి అవనీష్‌, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ సౌమీ కుమార్‌ పాండే భవిష్యత్తులో భారత స్టార్లుగా ఎదిగే అవకాశముంది. కులకర్ణి, అవనీష్‌ ఇప్పటికే ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్నారు. బ్యాటింగ్‌లో సహరన్‌, ముషీర్‌ఖాన్‌.. బౌలింగ్‌లో ఆరాధ్య శుక్లా, పాండే, కులకర్ణి ఫామ్‌ భారత్‌కు కీలకంగా మారనున్నారు. శుక్రవారం టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అమెరికాపై ఐర్లాండ్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్‌పై ఆతిథ్య దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.



భారత్‌ మ్యాచ్‌ల తేదీలు..
జూనియర్ల ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ తొలి మ్యాచ్‌ను ఈనెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. గ్రూప్‌ దశలో భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
జనవరి 20 : బంగ్లాదేశ్‌తో
జనవరి 25 : ఐర్లాండ్‌తో
జనవరి 28 : అమెరికాతో మ్యాచ్‌లు ఉన్నాయి.
భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌
మ్యాచ్‌లు జరుగుతాయి ఇలా..
2024 జనవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనుండగా, ఫిబ్రవరిలో ఫైనల్ జరగనుంది. జనవరి 19 నుంచి తొలి దశ పోటీలు జరుగుతాయి. ఈనెల 28 వరకు తొలి రౌండ్‌ పోటీలుంటాయి. ప్రతి గ్రూపులో టాప్‌ -3లో ఉన్న జట్లు సూపర్‌ సిక్స్‌ దశకు చేరుతాయి. సూపర్‌ సిక్స్‌లో కూడా మళ్లీ నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఈ దశలో ప్రతి గ్రూపులో టాప్‌ లో ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 3 దాకా ఈ పోటీలు సాగుతాయి. ఇక ఫిబ్రవరి 6, 8న రెండు సెమీఫైనల్స్‌ జరుగుతాయి. ఫిబ్రవరి 11న బెనొనిలోని విల్లోమూర్‌ పార్క్‌ వేదికగా తుది పోరు జరుగునుంది. ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు.