Ayodhya Rram Lalla Idol: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టంచనున్న బాల రామయ్య రూపం భక్తులను తన్మయానికి గురి చేస్తోంది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాల రాముని విగ్రహం. రామయ్య చిన్నప్పుడు ఇలానే ఉండేవాడా..? అన్నట్టుగా జీవం ఉట్టిపడేలా బాల రాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిలుచున్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. బాల రాముడికి ప్రాణం పోస్తూ అరుణ్‌ యోగిరాజ్‌ ఈ విగ్రహాన్ని కృష్ణశిలతో చెక్కారు. 51 అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. గురువారం గర్భాలయానికి విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఆలయంలో బాల రాముని విగ్రహాన్ని చూసి భక్తులు తరిస్తున్నారు. పద్మపీఠంపై 51 అంగుళాల ఎత్తులో బాల రామయ్య దర్శనమివ్వనున్నాడు. 


విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు.. 


బాల రామయ్య విగ్రహం నిలువెల్లా విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉండేలా తీర్చిదిద్దారు. బాల రాముని విగ్రహంలో కుడి చేతిలో బంగారం ధనస్సు, ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని దర్శనమిస్తున్నాడు. విగ్రహం మొత్తం 250 కేజీలు బరువు ఉన్నట్టు చెబుతున్నారు. రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్‌, గరుడ విగ్రహాలను చెక్కారు. రాముడి విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు. రాముడి విగ్రహంపై భాగంలో ఓం, శేష్‌నాధ్‌, సూర్య, గద, స్వస్తిక్‌, అభామండలాల్‌ను చెక్కారు. నిండైన ముఖం, చిరు నవ్వు, చిద్విలాసంతో కనిపిస్తున్న బాల రాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు. గర్భ గుడిలో ఈ రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 


సామాజిక మాధ్యమాల్లో వైరల్‌.. 


బాల రామయ్య విగ్రహం బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ఫొటో వైరల్‌ గా మారింది. నల్లని పద్మపీఠంపై కొలువై ఉన్న ఐదేళ్ల బాల రామయ్య విగ్రహం అబ్బురపరుస్తోంది. ఐదు అడుగులు ఎత్తులో ఉన్న బాల రాముని విగ్రహం భక్తులను తన్మయత్వానికి గురి చేస్తోంది. ఈ నెల 22న గర్భ గుడిలో బాల రామయ్యను ప్రతిష్టించనున్నారు.


ముందే దర్శనమివ్వడంపై దుమారం 


ప్రాణ ప్రతిష్ఠ తరవాత దర్శనమివ్వాల్సిన రామయ్య ముందే దర్శనమిచ్చాడు. కళ్లకున్న తెరను తొలగించారు. ఆ ఫొటోలే ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే...అసలు ప్రాణ ప్రతిష్ఠ జరగక ముందే ఆ తెరను ఎలా తొలగిస్తారు..? ఆ ఫొటోలు ఎవరు తీశారు..? ఎవరు బయట పెట్టారు అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడంపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు కొన్ని నియమాలు పాటించాలని, వాటిని ఉల్లంఘించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏ విగ్రహాన్నైనా ప్రతిష్ఠించే ముందు కళ్లను తప్పనిసరిగా కప్పి ఉంచాలని, అలా తెరను తొలగించడం దోషం అంటూ మండి పడ్డారు. దీనిపై కచ్చితంగా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. 


"కొత్త విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలని అనుకున్నప్పుడు దానికంటూ కొన్ని నిబంధనలుంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతానికి బాల రాముడి విగ్రహాన్ని పూర్తిగా కప్పేశాం. కానీ...ఎవరో దాన్ని తొలగించారు. కళ్లకున్న తెరనీ తీసేశారు. పూర్తిగా విగ్రహం కనిపించేలా ఫొటోలు తీశారు. ప్రతిష్ఠకు ముందు ఇలా చేయడం సరికాదు. ఈ తప్పిదం ఎలా జరిగిందో తప్పకుండా విచారణ చేపడతాం" - ఆచార్య సత్యేంద్ర దాస్, ప్రధాన పూజారి