Raksha Bandhan 2023: రక్షా బంధన్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాఠశాల విద్యార్థినులు రాఖీ కట్టారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో ప్రధాని మోదీకి పిల్లలు రాఖీ కట్టారు. విద్యార్థినులు ఎంతో ప్రేమతోత మోదీకి రాఖీ కట్టారు. రాఖీ కడుతున్న సమయంలో ఆయా విద్యార్థినుల పేర్లను, తరగతిని ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఓ చిన్నారి సంతోషం ఆపుకోలేక మోదీ చెంపపై ముద్దు పెట్టింది. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పాఠశాల విద్యార్థినిలతో, టీచర్లతో ప్రధాన మంత్రి గ్రూపు ఫోటో దిగారు. మోదీకి కట్టిన రాఖీల్లో కొన్నింటిపై మోదీ బొమ్మ ఉండటం విశేషం. అనంతరం చిన్నారులతో మోదీ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ రాఖీ పండగ జరుపుకుంటున్నారు. అలాగే దేశ సరిహద్దుల్లోనూ జవాన్లకు రాఖీలు కడుతున్నారు. 


రక్షా బంధన్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. అన్నా చెల్లెల్ల మధ్య ఉన్న అమితమైన ప్రేమకు రాఖీ నిదర్శనంగా ఉంటుందని ప్రధాని సందేశానిచ్చారు. రక్షా బంధన్ మన పవిత్ర సంస్కృతికి ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రజల మధ్య బంధాన్ని, సౌభాతృత్వాన్ని పెంపొందిస్తుందని చెప్పుకొచ్చారు.










కాగా, ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదం ఈ సారి రక్షా బంధన్ లో బలంగా పని చేస్తోంది. ఈ సంవత్సరం మార్కెట్ లో చైనా తయారు చేసిన రాఖీలు కనిపించకుండా పోవడం గమనార్హం. రాఖీ మార్కెట్ లో చైనాలో తయారు చేసిన రాఖీలు గతంలో భారీగా లభించేవి. అయితే కొన్నేళ్లుగా చైనా రాఖీలు కొనడానికి వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈసారి చైనా రాఖీలు చూద్దామన్నా కనిపించకుండా పోయినట్లు దుకాణాదారులు చెబుతున్నారు. మార్కెట్ లో భారతీయ రాఖీల వాటా 80 శాతానికి పైగా పెరిగినట్లు ఢిల్లీ ట్రేడ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దేవ్‌రాజ్ బవేజా తెలిపారు. మూడు, నాలుగేళ్ల నుంచి చైనా రాఖీలకు డిమాండ్ భారీగా తగ్గిందన్నారు.