Rajasthan News: కొన్ని విషయాలు వింటే వింతగా అనిపిస్తాయి. అలా కూడా జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఇలాంటివి ఎప్పుడూ వినడం, కనడం చేయని వారు వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతారు. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇలా.. ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి ఘటనే జరిగింది రాజస్థాన్ లో. 


లక్షా 50 వేల నష్టపోయానంటూ ఆవేదన..


రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కోహ్రానా కు చెందిన ఓ వృద్ధుడు పోలీసు స్టేషన్ కు వచ్చాడు. తనకు లక్షా 50 వేల రూపాయల నష్టం వాటిల్లిందని పోలీసులకు చెప్పాడు. తనకు జరిగిన నష్టంపై ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా కోరాడు. లక్షా 50 వేల రూపాయలు అంటే ఓ రైతుకు చిన్న మొత్తం ఏమీ కాదు. అది విన్న పోలీసులు ఆ వృద్ధుడికి జరిగిన నష్టానికి అయ్యో పాపం అనుకున్నారు. అంత మొత్తం తను ఎలా నష్టపోయాడో తెలుసుకునేందుకు ఫిర్యాదులో రాసుకునేందుకు అతడిని అడగడం మొదలు పెట్టారు. లక్షా 50 వేల రూపాయలు ఎలా కోల్పోయావు, నీకు నష్టం చేసింది ఎవరూ అని ఆరా తీశారు. అప్పుడు ఆ వృద్ధుడు తనకు ఎలా నష్టం జరిగింది, దానికి ఎవరు బాధ్యులో చెప్పడం మొదలు పెట్టగా అది విన్న పోలీసు స్టేషన్ లోని అధికారులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. పోలీసు అధికారులు ఆశ్చర్యపోవాల్సినంతగా ఆ వృద్ధుడు ఏం చెప్పాడు.. తనకు ఎలా నష్టం వాటిల్లిందో తెలుసుకోవడానికి ఇది చదవండి.


హెలికాప్టర్ కిందనుంచి వెళ్లడం వల్లే.. నివేదిక వచ్చాకే కేసు నమోదు!


అది రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా. బహ్ రోడ్ ప్రాంతం ఎమ్మెల్యే పేరు బల్జీత్ యాదవ్. బల్జీత్ యాదవ్ ఆదివారం తన నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ రాక సందర్భంగా బహ్ రోడ్ లోని కొందరు ఆయన అభిమానులు, మద్దతు దారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతించడానికి జోరుగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ నుండి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా వచ్చిన ఆ హెలికాప్టర్ బహ్ రోడ్ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. తర్వాత కోహ్రానా అనే గ్రామం మీదుగా తిరిగి వెళ్లి పోయింది. అయితే ఆ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల చాలా పెద్ద శబ్దం చేసింది. కోహ్రానా గ్రామంలో ఓ గేదె  తీవ్రంగా వచ్చిన శబ్దం వల్ల మృతి చెందిందని ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. హెలికాప్టర్ చేసిన శబ్దం వల్లే తన లక్షా 50 వేల రూపాయల విలువైన గేదె చనిపోయిందని ఆ వృద్ధుడు పేర్కొన్నాడు. ఆ హెలికాప్టర్ ను నడిపిన పైలట్ వల్లే తన గేదె చనిపోయిందని స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. చనిపోయిన గేదెను పరీక్ష నిమిత్తం పశువుల ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.