Bank Jobs 2022:  'కైలాసంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఏడాది శిక్షణ ఇచ్చి తర్వాత కైలాసంలో ఉద్యోగం ఇస్తాం. 'ఇదీ నిత్యానందస్వామి పేరుతో అంతర్జాలంలో వచ్చిన ప్రకటన. 


అందరికీ తెలిసిన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి కైలాసం పేరిట తనకు తానే ఒక దేశం నిర్మించుకున్న విషయం విదితమే. ఇప్పుడు అక్కడ వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు దేశంలోని ఆయన ప్రతినిథులు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.


కైలాస దేశంలోని నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస ఐటీ విభాగం, కైలాస రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయం తదితర శాఖల్లో ఖాళీలు ఉన్నాయట. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ ఇస్తారట. తర్వాత ఆయా శాఖ్లలో ఉద్యోగాల్లో నియమిస్తారట. ఇవీ నెట్టింట్లో పెట్టిన పోస్టుల సారాంశం. పోతే కొన్ని నెలల క్రితం నిత్యానంత ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. శ్రీలంకలో చికిత్సకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వానికి విన్నవించారు. తాజాగా నిత్యానంద పేరిట వచ్చిన ఈ ప్రకటనలు ఆయన తొలి ఆశ్రమం విస్తరించిన కర్ణాటకలో ఆసక్తిని రేకెత్తించాయి. 


వివాదాస్పద స్వామి


నిత్యానంద స్వామి మన దేశంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఆయన కోర్టు కేసుల్లో హాజరయ్యారు. 2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు ఆయన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది. ఆ దీవిని స్వయంగా ఆయన కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దానికి ఆయన కైలాస దీవి అనే పేరు పెట్టారు. ఆ కైలాస దీవికి ఆయనే ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు. అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. 


అయితే కొన్ని నెలల క్రితం నిత్యానంద స్వామి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌తో ఖంగుతిన్న నిత్యానంద స్వామి ...త‌న మ‌ర‌ణంపై సాగుతున్న ప్ర‌చారాన్ని ఖండించ‌డం విశేషం. తాను చ‌నిపోలేద‌ని, ప్ర‌స్తుతం స‌మాధిలో ఉన్న‌ట్టు స్వామి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మాట్లాడ‌లేక పోతున్న‌ట్టు తెలిపారు. మాట్లాడేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. మ‌నుషులు, పేర్లు, ప్రాంతాల‌ను గుర్తించ‌లేక‌పోతున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు. 27 మంది వైద్యులు త‌న‌కు వైద్యం చేస్తున్న‌ట్టు చెప్ప‌డం విశేషం. స్వామి పేరుతో ఆయ‌న మ‌నుషులు ఈ పోస్ట్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.