Warangal News: ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ (EWS Reservation) కల్పించే పేరు మీద నవంబర్ 7వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం స్పష్టమైన కార్యక్రమాన్ని తుడిచి పెట్టే దిశగా ఉందని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ లేఖ ద్వారా తెలిపారు. ఆర్థికంగా బలహీన సెక్షన్ల సాధికారతకు ప్రత్యామ్నాయ చర్యలు కల్పించడానికి బదులు, బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ కు 10 శాతం రిజర్వేషన్ కల్పించి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సామాజికంగా సమాన హోదాను నిరాకరిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్-ఖాజపాలు 'నయా భారత్' పేరుతో హిందూ రాష్ట్రం రూపొందించే కార్యక్రమాలలో ఇది ఒకటని చెప్పుకొచ్చారు.


ఆర్థిక బలహీన సెక్షన్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు భీజేపీ ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన 103వ సవరణకు వ్యతిరేకంగా 40 పిటిషన్లు దాఖలు అయ్యాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు 2022 నవంబర్ 7వ తేదీన ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ, లలిత్ నేతృత్వంలో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనం 3-2 అభిప్రాయాలతో 103వ సవరణ రాజ్యాంగ బద్ధతను ఎత్తి పట్టిందన్నారు. ఈడబ్ల్యుఎస్ కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాదని తీర్పునిచ్చిందని వివరించారు. ఈ తీర్పు భిన్న అభిప్రాయాలతో వచ్చిందని మీడియాలో ప్రచారం జరుగుతోందని అభయ్ పేర్కొన్నారు. అయితే ఇది వాస్తవం కాదని.. నిజానికి, అసమ్మతి తెలిపిన జస్టిస్ యూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భటీ సూత్ర బద్ధంగా 103వ సవరణకు వ్యతిరేకం కాదని.. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సమూహాలకు చెందిన ఆర్థికంగా బలహీన ఉన్న సెక్షన్లను ఇందులో చేర్చలేదన్న విషయంలో మాత్రమే విభేదించారని వివరించారు. ఈ తీర్పు ద్వారా సామాజిక వెనుకబాటుతనంపై ఆధారపడి ఇకపై చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.


దీర్ఘ కాలంగా సామాజికంగా వెనుకబడిన కులాలు, సమూహాలపై బ్రాహ్మణీయ సమాజం రుద్దిన వివక్షను తొలగించేందుకు సామాజిక వెనుక బాటుతనం పునాదిగా రిజర్వేషన్ అవసరం అని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు సామాజిక వెనుక బాటుతనంతో రిజర్వేషన్ కల్పనను మార్చి వేస్తోందన్నారు. 103వ సవరణ చట్టం అధికరణం 15(4), 15(5), అధికరణం 16(4) ఆర్థికంగా వెనుక బాటుతనంపై ఆధారపడి కల్పించే 10 శాతం రిజర్వేషన్ ను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఈ తీర్పు మినహాయింపును కల్పిస్తుందని అభయ్ లేఖ ద్వారా వివరించారు. 1992 నాటి ఇందిరా సహానీ తీర్పులో, సుప్రీం కోర్టు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్థిక వెనుకబాటుతనంపై ఆధారపడి 10 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంన్నారు. అలాగే రిజర్వేషన్ 50 శాతం. కొలమానాన్ని మించకూడదని వివరించారు. నవంబర్ 7వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ల అమలు లేకుండా చేస్తుందని ఆరోపించారు. జనాభాను బట్టి చూసుకున్నప్పుడు సామాజిక వెనుక బాటుతనం ఉన్న సమూహాలకు ప్రస్తుత రిజర్వేషన్ విధానం కూడా సరిపోదు. వాళ్లకు ప్రభుత్వ రంగంలో తగిన నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేదన్నారు. 


ఎస్సీలకు 4.6 శాతం తక్కువగా ఉండగా, ఎస్టీలకు 1.5 శాతం కంటే తక్కువగా ఉన్నది. ఓబీసీలలో 53 నుంచి 54 శాతం వరకు ఉన్నది. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలలో అణగారిన సమూహాల నుంచి సెలెక్షన్స్ తీవ్రంగా పడిపోతాయని అభయ్ అన్నారు. అణగారిన సమూహాలకు రిజర్వేషన్ విధానం ప్రారంభమైన నాటి నుంచి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడంలో అనేక లోపాలు జరుగుతున్నాయన్నారు. ఈ తీర్పు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బలంగా చెప్పిన సామాజిక న్యాయం, సామాజిక సమానత్వ భావాలకు పూర్తిగా వ్యతిరేకమైందని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం యావత్తు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకువచ్చి దేశాన్ని నాశనం చేస్తుందన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన సెక్షన్ల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తుంది ఆరోపించారు. ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఈ విధానాలను అమలు పరచకుండా ఉంటుందన్నది దాచేస్తే దాగని సత్యం రిజర్వేషన్ విధానాన్ని బ్రాహ్మణీయం చేయడాన్ని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా ఉన్న సౌకర్యాలను నాశనం చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ బలంగా వ్యతిరేకిస్దోందన్నారు. సామాజికంగా అణగారిన సమూహాలకు రిజర్వేషన్ విధానాన్ని నీరు కార్చేందుకు ఈ అంబేద్కర్ వ్యతిరేక, దళిత వ్యతిరేక, బీసీ వ్యతిరేక, ఆదివాసుల వ్యతిరేక ఫాసిస్టు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.