Rajasthan: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. చూపు సరిగ్గా కనిపించడం లేదని ఆపరేషన్ చేయించుకుంటే ఉన్న చూపు కూడా పోయింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. 18 మంది వ్యక్తులు కంటి చూపు శస్త్రచికిత్స చేయించుకోగా.. వారందరికీ పూర్తిగా కంటి చూపు కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరందరికి రాజస్థాన్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. బాధితులు అంతా కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కంటి చూపు కోల్పోయిన 18 మందిలో ఎక్కువ మంది రాజస్థాన్ ప్రభుత్వ చిరంజీవి ఆరోగ్య పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు. 


జూన్ 23వ తేదీన వీరికి కంటి శుక్లం ఆపరేషన్ జరిగింది. జులై 5వ తేదీ వరకు అంతా బాగానే ఉంది. బాధితులకు కంటి చూపు కూడా సక్రమంగానే ఉంది జులై 6 -7 తేదీల్లో ఆపరేషన్ చేయించుకున్న 18 మంది కంటి చూపు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్ చేసినా కంటి చూపు రాలేదు అని ఓ బాధితుడు తెలిపారు. బాధితులు కంటి చూపు కోల్పోవడానికి ఇన్ఫెక్షన్ సోకడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. వారికి సోకిన ఇన్ఫెక్షన్ ను నయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే పలువురు రోగుల్లో కంటి నొప్పి కూడా తీవ్రంగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వారందరినీ తిరిగి ఆస్పత్రిలో చేరాలని కోరినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. కొంత మందికి మళ్లీ సర్జరీ చేసినా రెండుసార్లకు మించి ఆపరేషన్ చేసినా కంటి చూపు తిరిగి రాలేదని తెలిపారు. సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆప్తాల్మాలజీ విభాగం అధికారులు మాత్రం.. తాము చేసిన ఆపరేషన్లలో ఎలాంటి లోపం లేదని అంటున్నారు. రోగులకు కంటి చూపు కోల్పోవడంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.






కంటి శుక్లం అంటే ఏంటి?


అంధత్వానికి దారితీసే వాటిలో కంటిశుక్లం ప్రధానం కారణంగా ఉంది. దీన్ని సాధారణ శస్త్ర చికిత్స విధానాాలతో నివారించవచ్చు. పూర్తి స్థాయిలో దృష్టిని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శుక్లం ముదిరితే ఆపరేషన్ కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కంటిశుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ను తొలి దశలో గుర్తిస్తే కంటి చూపు కోల్పోకుండా చికిత్స చేయవచ్చు. మధుమేహం, గ్లకోమా, మూత్రపిండాల వ్యాధి, కంటి గాయాలు, ధూమపానం, కంటి లోపల మంట, కొన్ని రకాల ఔషధాలు, జన్యు పరమైన కారణాలు, కంటికి సోకే ఇన్ఫెక్షన్ల వల్ల కంటిశుక్లం వస్తుంది.


కంటి శుక్లం లక్షణాలు:


కంటి శుక్లం వచ్చిన వారిలో కంటి గుడ్డుపై మబ్బుగా కనిపిస్తుంది. కంటి చూపు అస్పష్టంగా ఉంటుంది. ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది. రాత్రిపూట చూపు మరింత బలహీనంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కంటి నొప్పి ఇబ్బంది పెడుతుంది. మసక వెలుతురులో కంటిచూపు సరిగ్గా ఉండదు. కనుబొమ్మలు అసంకల్పితంగా వణుకుతాయి.