Father kills son: ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా యువతి, యువకులు మద్యానికి బానిసలవుతున్నారు. మద్యం, జల్సా తిరగడాలు వంటి వాటికి బానిసలై జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారిని మందలించాలని ప్రయత్నించే తల్లిదండ్రులకే ఎదురు తిరుగుతున్నారు. తాజాగా కర్ణాటకలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఇంట్లో గొడవకు దిగిన యువకుడ్ని.. అతడి తండ్రి, సోదరుడు కలిసి కర్రతో కొట్టి చంపారు. అనంతరం ఇంటి వెనకాల స్థలంలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. యువకుడి మృతి పట్ల అనుమానం వచ్చిన గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కర్రతలో బలంగా కొట్టి హత్య...
కర్ణాటక బెళగావి జిల్లా హిడ్కల్ గ్రామానికి చెందిన మహాలింగయ్య గురుసిద్ధయ్య హిరేమఠ్ (54) అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. మొదటివాడు బసయ్య హిరేమఠ్(26), రెండో కుమారుడు సోమయ్య మహాలింగయ్య (24). అయితే గురుసిద్ధయ్య చిన్న కుమారుడు సోమయ్య గత కొంత కాలంగా మద్యపానానికి అలవాటు పడ్డాడు. సోమయ్య రోజూ ఇంటికి తాగి వచ్చి గొడవ చేసేవాడు. రోజురోజుకూ సోమయ్య ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసుగుచెందారు. ఈ క్రమంలో జులై 10వ తేదీన సోమయ్య.. మద్యం తాగడానికి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి గొడవ తీవ్రమైంది. సోమయ్య తండ్రి గురుసిద్ధయ్య, తన పెద్ద కుమారుడు బసయ్య కలిసి.. అతడి తలపై కర్రతో బలంగా కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సోమయ్య అక్కడికక్కడే మరణించాడు.
ఇంటి వెనుకే అంత్యక్రియలు..
కొడుకు చనిపోయిన తర్వాత గురుసిద్ధయ్య తన ఇంటి వెనకాలే అంత్యక్రియలు నిర్వహించాడు. కానీ సోమయ్య మృతి పట్ల అనుమానంతో గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సంజీవ్ పాటిల్ ఘటనా స్థలికి చేరుకొని మృతుడి తండ్రిని, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం కాలిన మృతదేహం అవశేషాలను ల్యాబ్‌కు పంపారు.
ఐటీ కంపెనీ ఎండీ, సీఈఓ దారుణ హత్య...
మరోవైపు బెంగుళూరులోను దారుణ హత్య ఒకటి వెలుగుచూసింది. తన కంపెనీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని భావించిన మాజీ ఉద్యోగి ఏరోనిక్ కంపెనీ ఎండీ, సీఈఓలను కత్తితో నరికి చంపాడు. ఏరోనిక్స్ టెక్నాలజీ కంపెనీలోకి చొరబడిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను దారుణంగా హత్య చేశాడు. గతంలో తాను పనిచేసిన టెక్ కంపెనీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చిన దుండగుడు ఉన్నతాధికారులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఏరోనిక్స్ ఇంటర్‌నెట్ కంపెనీ ఎండీ ఫణింద్ర సుబ్రమణ్యం, సీఈవో విను కుమార్‌లు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. దాడి చేసిన వ్యక్తిని ఫెలిక్స్‌గా గుర్తించగా ప్రస్తుతం నిందితుడితో సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ హత్యకు ముందు నిందితుడు తన ఇన్ స్టాగ్రాంలో ఓ సంచలన పోస్ట్ చేశాడు. తాను చెడ్డ వ్యక్తులను మాత్రమే బాధపెడతాను అంటూ హత్యకు గురైన సీఈఓ, ఎండీలను ఉద్దేశిస్తూనే పోస్ట్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.