Viral News:


కూరగాయాల ధరలు ఎంత పెరిగినా పండించే రైతున్నకు దక్కేది కొంతే! వినియోగదారులు ఎలాగూ అధిక ధరలకే కొంటారు. ఏదేమైనా అల్టిమేట్‌గా లాభపడేది మధ్య దళారులే! ఇప్పటి వరకు మనం అలవాటు పడిన సన్నివేశం ఇదే! అయితే టమాట పుణ్యామా అని కొన్ని రైతు కుటుంబాలు ఇప్పుడు డబ్బుల పంట పండిస్తున్నాయి. కర్ణాటకలోని ఓ అన్నదాత కుటుంబం ఒకే రోజు ఏకంగా రూ.38 లక్షల సొమ్ము కళ్లచూసింది!


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాట ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటాయి. రాష్ట్రాలు, నగరాలను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే చివరి నెల్లోనే ఏకంగా 326 శాతం ధర పెరిగిందని ప్రభుత్వ సమాచారం. కర్ణాటకలోని కొందరు రైతులకు ఇది వరంగా మరింది. కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం మంగళవారం 2000 బాక్సుల టమాట అమ్మి ఏకంగా రూ.38 లక్షలు సంపాదించిందని టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ చేసింది.


కర్ణాటకలోని బేతమంగళ జిల్లాలో ప్రభాకర్ గుప్తా ఆయన సోదరులు కలిసి 40 ఎకరాల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరూ 15 కిలోల టమాట బాక్స్‌ (Tomato) ఒక్కోటి రూ.800కు అమ్మారు. మొన్నటి వరకు వారు చూసిన అత్యధిక ధర అదే! కానీ మంగళవారం ఒక్కో డబ్బాను ఏకంగా రూ.1900కు విక్రయించారు. తాము నాణ్యమైన టమాటాలను పండిస్తామని, ఎరువులు, పురుగుల మందులు ఎలా వాడాలో బాగా తెలుసని ప్రభాకర్‌ సోదరుడు సురేశ్ అంటున్నారు. ఆ విజ్ఞానం వల్లే తమ పంట చీడపీడల పాలవ్వకుండా రక్షించుకున్నామని తెలిపాడు.


చింతామణి తాలూకా విజకూర్‌ గ్రామానికి చెందిన వెంకట రమణా రెడ్డి అనే రైతు మంగళవారం 15 కిలోల టమాట బాక్సును రూ.2200కు అమ్మేశారు. రెండేళ్ల క్రితం రూ.900 ఒక్కో డబ్బా అమ్మానని, అప్పటి వరకు అదే రికార్డని పేర్కొన్నారు. ఒకే ఎకరంలో టమాట వేశానని 54 బాక్సులను కోలార్‌లోని ఏపీఎంసీ మార్కెట్‌కు తెచ్చానని వెల్లడించారు. అందులో 36 డబ్బాలు రూ.2200, మిగిలినవి రూ.1800 విక్రయించానని వివరించారు. మొత్తంగా రూ.3.3 లక్షల వరకు ఆదాయం వచ్చిందన్నారు.


టమాట సరఫరా తగ్గడంతోనే ధరలు బాగా పెరిగాయని కేఆర్‌ఎస్‌ టమాట మండీకి చెందిన సుధాకర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం 15 కిలోల డబ్బాలు రూ.2200 నుంచి రూ.1900 వరకు పలికాయని తెలిపారు. 2021 నవంబర్లో 15 కిలోల డబ్బాను రూ.2000 వేలం వేయడం తనకు గుర్తుందని వెల్లడించారు. చీడ పీడల నుంచి పంటలను కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


కోలార్‌లో చాలామంది రైతులు కొన్ని నెలలుగా టమాట పంట పండించడం తగ్గించేశారు. ధరలు బాగా పడిపోవడమే ఇందుకు కారణం. అయితే మంగళవారం దేశవ్యాప్తంగా కిలో టమాట సగటున రూ.109గా ఉందని ప్రభుత్వ సమాచారం.


Also Read: డీఏ అప్‌డేట్‌ - జులై 1 నుంచి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగుల జీతం పెంపు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial