Lokesh : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ఆర్‌సీపీకి చెందిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు నారా లోకేష్. ఈ కేసుల విషయంలో మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. కోర్టుకి హాజరవుతున్న కారణంగా 13,14 తేదీలలో యువగళం పాదయాత్రకి విరామం ఇచ్చారు. తనపైనా, తన కుటుంబంపైనా అసత్య ఆరోపణలని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల ఫేక్ ప్రచారం పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో లోకేష్ ని టార్గెట్ చేసుకుని ఫేక్ ప్రచారం
వైసీపీ నేతలు, సోషల్ మీడియా బాధ్యులు కూడా తనని టార్గెట్ చేస్తూ చేసిన అసత్య ప్రచారంపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేశారు. ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది.
కొత్త కొత్త ఆరోపణలతో దేవేందర్ రెడ్డి ప్రచారం
తన ఆరోపణలు ఫేక్ అని తెలిసినా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు. తప్పుడు రాతలపై గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి తన లాయర్ దొద్దాల కోటేశ్వరరావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గా పనిచేస్తుండడంతో ఆయా కార్యాలయాలకు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివరికి గుర్రంపాటికి వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు.
చంద్రబాబు కుటుంబంపై పోతుల సునీత తీవ్ర ఆరోపణలు
సెప్టెంబరు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని పిలుపునిచ్చారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని తప్పుడు ఆరోపణలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని, లోకేష్‌కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని సునీత ఆరోపింారు.
అన్నింటినీ సాక్ష్యాధారాలతో కోర్టులో సమర్పించిన లోకేష్
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తనపైనా, తన కుటుంబంపైనా పోతుల సునీత చేసిన దారుణమైన తప్పుడు వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై దాఖలు చేసిన కేసుల్లో ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్ అయిన నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టులో 14వ తేదీ శుక్రవారం నమోదు చేయనున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ 12న పాదయాత్ర ముగించుకొని బయలుదేరి అమరావతి రానున్నారు. కోర్టు పనిమీద వస్తుండడంతో యువగళం పాదయాత్రకి 13,14వ తేదీలలో విరామం ప్రకటించారు.