రైళ్లలో తరచూ ప్రయాణించే వారికి చేదు వార్త ఇది. కన్ఫార్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకోవడం ఇకపై ప్రియం కానుంది. ఎందుకంటే కన్ఫార్మ్ అయిన టికెట్లను క్యాన్సిల్ చేసుకున్న సందర్భంలో జీఎస్టీ ఇకపై తిరిగి రాదు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదే విధానం హోటల్ బుకింగ్ క్యాన్సిలేషన్ పైన కూడా వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.


రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం అనేది సర్వీస్. అంటే రైల్వే శాఖ అయిన సర్వీస్ ప్రొవైడర్, ప్రయాణం అనే సేవను అందించడానికి ప్రయాణికుడితో చేసుకొనే ముందస్తు ఒప్పందం అని సర్క్యులర్లో వివరించారు. ఆ ఒప్పందాన్ని ప్రయాణికుడు ఉల్లంఘిస్తే (టికెట్ క్యాన్సిల్ చేస్తే) దానికి ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు రుసుము కూడా చెల్లింపుల పరిధిలోకే వస్తుంది కాబట్టి, దానికి కూడా జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వుల్లో వివరించారు. రైలులో ఏ తరగతికి చెందిన రైల్వే టిక్కెట్‌ల రద్దు ఛార్జీలు ఆ తరగతికి బుక్ చేసిన టిక్కెట్‌ల రేటుకు జీఎస్టీ వర్తించనుంది.


ఉదాహరణ
* ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ టిక్కెట్‌ల బుకింగ్‌పై 5 శాతం GST ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్ ల టిక్కెట్ల రద్దు కోసం క్యాన్సిలేషన్ ఫీజులో కూడా 5 శాతం GSTని చెల్లించాలి.


రైలు బయలుదేరే 48 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేసినట్లయితే, AC ఫస్ట్ క్లాస్, AC ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్‌లను రద్దు చేయడానికి రూ.240 రద్దు రుసుమును విధిస్తారు. ఈ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు, ప్రయాణీకుడు 5 శాతం GST చెల్లించాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క కొత్త సర్క్యులర్ ప్రకారం, ప్రయాణీకులు ఇప్పుడు రద్దు రుసుముపై అదే రేటుతో GST చెల్లించవలసి ఉంటుంది, కాబట్టి కన్ఫార్మ్ అయిన AC టిక్కెట్‌ను రద్దు చేస్తే, ప్రయాణీకుడు అదనంగా రూ.12 చెల్లించాలి. అంటే రూ.240 కి రూ.12 కలిపి మొత్తం రూ.252 కట్టాలి.


AC 2-టైర్ టిక్కెట్‌ను ప్రయాణం ప్రారంభానికి 48 గంటల ముందు లేదా అంతకంటే ముందు టికెట్ ను క్యాన్సిల్ చేయడానికి, రద్దు రుసుముగా రూ.200, AC 3-టైర్ టిక్కెట్‌కు రద్దు రుసుముగా రూ.180 విధిస్తున్నారు. ప్రయాణానికి రెండ్రోజుల నుంచి 12 గంటల మధ్య సమయం ఉంటే అప్పుడు టిక్కెట్ ధరలో 25 శాతం రద్దు రుసుముగా వసూలు చేస్తున్నారు. అలాగే, 12 గంటలలోపు టికెట్ రద్దు చేయబడితే, రైలు బయలుదేరడానికి 4 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే, టిక్కెట్ ధరలో 50 శాతం రద్దు రుసుముగా వసూలు చేస్తున్నారు. ఈ అన్ని సందర్భాల్లో టికెట్ రద్దు కోసం రద్దు రుసుముపై 5 శాతం చొప్పున GST కూడా కట్టాల్సి ఉంటుంది. 


వీరికి వర్తించదు
అయితే, సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్ రద్దుపై ఎటువంటి GST ఛార్జ్ చేయబోమని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వచ్చేది పండుగల సీజన్. అప్పటికప్పుడు టికెట్లు దొరకవు కాబట్టి, కొన్ని నెలల ముందుగానే చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆఖరి నిమిషంలో కుదరక ప్రయాణం రద్దు చేసుకునే అందరిపైనా ఈ జీఎస్టీ భారం పడనుంది. అయితే, ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ జీఎస్టీ భారం వర్తిస్తుంది.