Crime Rate Details: తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB Report 2021) విడుదల చేసిన నివేదిక చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీంగా పెరిగాయి. 2019వ సంవత్సరంలో 2,691 సైబర్ నేరాలు జరగ్గా.. 2020లో ఆ సంఖ్య 5,024కు పెరిగింది. 2021లో అయితే ఈ సంఖ్య 10,303కు చేరిపోయింది. దేశ వ్యాప్తంగా 52,430 కేసులు నమోదు అవ్వగా అందులో తెలంగాణలో 10 వేలకు పైగా కేసులు ఉండడం గమనార్హం. మొత్తం 40 శాతం సైబర్ నేరాలు మన రాష్ట్రంలోనే నమోదై మొదటి స్థానంలో నిలవగా.. ఉత్తర ప్రదేశ్ 8,829 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాలు 2,180, ఓటీపీ మోసాలు 1,377, మార్ఫింగ్ కేసులు 18, ఫేక్ ప్రొఫైల్ తయారీ కేసులు 37, ఏటీసీ కేసులు 443 నమోదు అయినట్లు జాతీయ నేర గణాంక సంస్థ వివరిస్తోంది.
రైతు ఆత్మహత్యల్లో నాలుగో స్థానం..
ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు కూడా తెలంగాణలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. మొత్తం 8693 కేసులు నమోదు అవ్వగా.. 2019లో 11,465, 2020లో 12,985, 2021లో 20,759కి చేరుకున్నాయి. ఈ తీరు చూస్తే రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అలాగే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2021లో దేశ వ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేస్కున్నారు. వీటిలో 4,806 మంది రైతులు, 5,121 మంది కౌలు రైతులు ఉన్నారు. అలాగే 5 వేల 563 మంది రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,429 మంది రైతులు, 1,329 మంది కౌలు రైతులు, 1,424 మంది రైలు కూలీలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కర్ణాటక, ఏపీ రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. మన దగ్గర 303 మంది రైతులు, 49 మంది కౌలు రైతులు, ఏడుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో..!
వృద్ధులపై దాడుల్లో కూడా మన రాష్ట్రం ముందంజలోనే ఉంది. 1952 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 6,190 కేసులతో మొదటి స్థానంలో నిలవగా... మధ్య ప్రదేశ్ 5,273 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత మహిళలను అవమానించిన కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 151 కేసులు నమోదు కాగా.. అందులో ఏపీవి 83, తెలంగాణవి 21 కేసులు ఉండడం గమనార్హం. లైంగిక అక్రమ రవాణా కేసుల్లో కూడా తెలంగాణ ముందు వరుసలోనే ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 2083 కేసులు నమోదు అవ్వగా.. తెలంగాణలోనే 347 కేసులు నమోదయ్యాయి.
రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు నెంబర్ వన్..
అక్రమ రవాణా కేసుల్లో 1050 మంది నిందితుల అరెస్టుతో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కుటుంబ సమస్యలతో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేస్కున్న కేసులు ఒడిశాలో ఎక్కువ ఉడగా.. ఇందులో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. అలాగే 2020తో పోలిస్తే 2021లో రోడ్డు ప్రమాదాలు 58 శాతం పెరిగి తొలి స్థానంలో ఉంది. యూపీలో 15.2, తెలంగాణ 10.8, ఏపీ 9.5, పంజాబ్ 9.1 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది.