Amethi-Raebareli Congress Candidate: కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ ఈ ఉదయం(శుక్రవారం, మే 3 2024) తెరదించింది. రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారో ప్రకటించేసింది. రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుంటే.... అమేథీ నుంచి కిశోరీ లాల్‌ శర్మ బరిలో నిలబడుతున్నారు. 


గురువారం సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల బృందం ఈ రెండు స్థానాలపై సుదీర్ఘంగా చర్చించింది. గురువారం రాత్రి ఈ జాబితాను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ... అనూహ్యంగా నామినేషన్‌కు కొన్ని గంటల ముందు పేర్లను రివీల్ చేసింది కాంగ్రెస్. అందులో ఒక పేరు ఊహించిందే అయినా రెండు పేరు మాత్రం అనూహ్యమే. 


రాయ్‌బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్‌ మాత్రం దీనిపై మౌనం పాటిస్తూ వచ్చింది. చివరి నిమిషంలో క్లారిటీ ఇచ్చింది. నామినేషన్ రోజునే రాహుల్‌ పేరును ప్రకటించింది. ఇవాళ నామినేషన్ అట్టహాసంగా వేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుంది. రాహుల్ నామినేషన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు తల్లి సోనియా గాంధీ కూడా హాజరవుతారని అంటున్నారు.


తీవ్రస్థాయిలో చర్చ జరిగిన మరో నియోజకవర్గం అమేథీ. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్‌ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారా అనే డిస్కషన్ జరిగింది. చివరి నిమిషం వరకు ప్రియాంక పేరు వినిపించింది. కానీ ఆఖరి నిమిషంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది.  


ఇంతకీ ఎవరీ కిషోరీ లాల్‌ శర్మ?
అమేథీ నుంచి కాంగ్రెస్‌ తరఫున కిశోరి లాల్‌ శర్మను పోటీలోకి దించారు. ఈయన సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా చెబుతారు. కేఎల్‌ శర్మ స్వస్థలం  పంజాబ్‌లోని లిథియానా. అమేథీలో కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఉండే వాళ్లు. ఆ నియోజకవర్గంలో అణువణువూ ఆయనకు తెలుసు. కాంగ్రెస్ ఐడియాలజీని, అప్పటి యూపీఏ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించింది ఈయనే. 



రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమేథీలో నామినేషన్ వేసినప్పుడు ఉన్న వ్యక్తుల్లో ఈ కేఎల్‌శర్మ ఒకరు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు చేరువ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో తిరుగుతూ వచ్చారు. అంతకు ముందు సోనియాగాంధీ అక్కడ ఎంపీగా ఉన్న టైంలో కూడా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే వాళ్లు. వాళ్ల తరఫున అక్కడ ప్రజలకు సేవ చేసేవాళ్లు. 1999 నుంచి ఇప్పటి వరకు పరోక్షంగా ప్రజలకు సేవ చేసిన కేఎల్‌ శర్మ ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.