Rahul Gandhi Convoy: దాదాపు రెండు నెలలుగా హింసతో రగిలిపోతున్న మణిపూర్ లో రెండు రోజులు పర్యటించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ అగ్ర నేత కాన్వాయ్ ను పోలీసులు నిలువరించారు. చంద్రాపూర్ జిల్లా వైపుగా కాన్వాయ్ వెళ్తుండగా.. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ వద్ద పోలీసులు రాహుల్ గాంధీని అడ్డుకున్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ దిల్లీ నుంచి విమానంలో ఇంఫాల్ కు చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ ను చురాచంద్ పూర్ జిల్లాకు వెళ్లకుండా పోలీసుల నిలువరించారు. 


జూన్ 29, 30వ తేదీల్లో రెండు రోజుల పాటు హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. అల్లర్లలో తీవ్రంగా దెబ్బతిని నిరాశ్రయులు అయిన కుటుంబాలను చురాచంద్ పూర్ లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఉంచారు. అక్కడ ఉన్న స్థానికులను కలవాలని రాహుల్ గాంధీ అక్కడికి బయలు దేరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 లకు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కారు. ఈ శిబిరాల్లో దాదాపు 50 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్ లో ప్రశాంతత వెల్లివిరియాలంటే సమాజంలో శాంతి అవసరమని కేసీ వేణుగోపాల్ అన్నారు. 


రాహుల్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు రోడ్డు మార్గం ద్వారా వెళ్లొద్దని ఆయనకు సూచించారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వాయు మార్గంలో వెళ్లాలని చెప్పారు. హెలికాప్టర్ లో అక్కడి వెళ్లవచ్చని సూచించారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బిష్ణుపూర్ లో కాన్వాయ్ ని ఆపివేయాలని రాహుల్ గాంధీని కోరినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 






రాహుల్ గాంధీని అడ్డుకోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. మణిపూర్ లోని బిష్ణుపూర్ సమీపంలో రాహుల్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సహాయ శిబిరాల్లో మగ్గుతున్న ప్రజలను కలుసుకునేందుకు, కలహాలతో  అల్లాడుతున్న రాష్ట్రంలో వైద్యం అందించేందుకు రాహుల్ అక్కడికి వెళ్తుండగా పోలీసులు నిలువరించినట్లు చెప్పారు. మణిపూర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడటం లేదని, రాష్ట్రాన్ని వదిలేశారని ఆరోపించారు. సహృద్భావంతో చేపట్టిన రాహుల్ పర్యటనను డబుల్ ఇంజిన్ సర్కారు నిరంకుశ పద్ధతులతో ఆపాలని చూస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడమేనని అన్నారు. మణిపూర్ కు శాంతి అవసరమని, ఘర్షణ కాదని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. 


Also Read: Fire Accident: హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి రథానికి మంటలు, త్రిపురలో ఆరుగురు దుర్మరణం






Join Us on Telegram: https://t.me/abpdesamofficial