Phonepe: కర్ణాటక ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎలాంటి ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. 30 పర్సంటేజ్ ప్రభుత్వం అంటూ జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ ఫాార్ములాతోనే అక్కడ విజయవంతమైంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా అదే స్ట్రేటజీని వాడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రతి పనికి 50 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టింది. దీనికి అనుకూలంగా రాష్ట్రంలో రాత్రికి రాత్రే పోస్టర్లు వేసింది. అయితే ఈ పోస్టర్ల వ్యవహారంతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. దీనిపై ఫోన్‌పే సంస్థ సీరియస్ అయింది.
సీఎంకు వ్యతిరేకంగా ఫోన్ పే లోగోతో పోస్టర్లు వేయడంపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యతిరేక నిరసనల్లో తమ లోగో వినియోగించడాన్ని ఫోనే పే ఖండించింది. అనుమతి లేకుండా ఇలాంటి నిరసనల కోసం తమ లోగో వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీని ఫోన్ పే హెచ్చరించింది.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఒకరి పని తీరుపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్.. శివరాజ్ సింగ్ చౌహాన్ ను టార్గెట్ చేసుకుంది. ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ ఆరోపణలు చేస్తోంది. అందులో భాగంగానే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగర వీధుల్లో పోస్టర్లు ఏర్పాటు చేసింది.
ఈ పోస్టర్లలో ఫోన్ పే లోగోను పోలిన డిజైన్ వాడటంతోపాటు ఫోన్ పే అనే అక్షరాలనూ వాడుకుంది. క్యూఆర్ కోడ్ మధ్యలో శివరాజ్ సింగ్ ఫొటో ఏర్పాటు చేసింది. 50% లావో, ఫోన్ పే కామ్ కరో (50 శాతం కమీషన్ ఇవ్వండి.. అన్ని పనులూ అయిపోతాయి) అంటూ ఆ పోస్టర్లను డిజైన్ చేయించింది.
ఈ పోస్టర్ల ఫోటోలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ ట్వీట్ లో కట్ని రైల్వే స్టేషన్ లో అంటించిన పోస్టర్ల ఫోటోలు పెట్టింది. దీనిపై ఫోన్ పే సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. పోస్టర్ల నుంచి తమ సంస్థ లోగోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. రాజకీయ, రాజకీయేతరులు ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోన్ పే లోగోను వాడకూడదని హెచ్చరించింది. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
'ఫోన్ పే లోగో అనేది మా కంపెనీ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. ఫోన్ పే మేధో సంపత్తి హక్కులను భంగం కలిగించే ఏ పనిపై అయినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫోన్ పే బ్రాండ్ లోగో, రంగును కలిగి ఉన్న పోస్టర్లను, బ్యానర్లను తీసివేయాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధినాయకత్వానికి వినమ్రంగా అభ్యర్థిస్తున్నాం' అని ఫోన్ పే ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ ఇలాంటి పోస్టర్లు వెలిశాయి. అప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. పేసీఎం పేరిట పోస్టర్లు ఏర్పాటు చేసింది. అదే వ్యూహాన్ని ఇక్కడ కూడా అవలంబిస్తోంది కాంగ్రెస్ పార్టీ.