Tripura Fire Accident : త్రిపురలోని ఉనకోటి జిల్లాలో జరిగిన రథయాత్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. హై టెన్షన్ విద్యుత్ తీగలకు రథం తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జగన్నాథుని ఉల్టా రథయాత్ర ఉత్సవం సందర్భంగా కుమార్ ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు చెప్పారు. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతతో కలిసి.. రథాయాత్ర జరిగిన ఓ వారం తర్వాత తిరిగి వారి నివాసానికి వస్తారు. ఈ సందర్భంగా ఉల్టా రథయాత్ర నిర్వహిస్తారు.
పూర్తిగా ఇనుముతో తయారు చేసి రథాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్నప్పుడు 133 కేవీ ఓవర్ హెడ్ కేబుళ్లకు తగిలినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అనేక మంది భక్తులు ఆ రథాన్ని లాగుతున్నారని వివరించారు. ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్(లా & ఆర్డర్) జ్యోతిష్మాన్ దాస్ చౌదరి తెలిపారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
భక్తుల మృతిపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం తెలియజేశారు. కుమార్ ఘాట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మరణించారని పలువురు గాయపడ్డారని తెలిపారు. ఉల్టా రథయాత్రలో భాగంగా అనేక మంది భక్తులు రథాన్ని లాగుతున్న సమయంలో విద్యుదాఘాతం జరిగి మంటలు అంటుకున్నట్లు చెప్పారు. ఈ దుర్ఘటనతో బాధపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కారు వారికి అండగా ఉంటుందన్నారు. దుర్ఘటన జరిగిన కుమార్ ఘాట్ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
'కుమార్ ఘాట్ వద్ద ఉల్టా రథయాత్రలో భాగంగా రథాన్ని లాగుతుండగా విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. కొంత మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో నేను చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడానికి అగర్తల నుంచి కుమార్ ఘాట్ కు రైలులో వెళ్తున్నాను' అని ముఖ్యమంత్రి మాణిక్ సాహా ట్వీట్ లో పేర్కొన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial