Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర సర్కారు రంగం సిద్ధం చేసింది. జులై మూడో వారం నుంచి మాన్‌సూన్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సమావేశాలు కచ్చితంగా ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నది అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జులై 17 లేదా 20వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఆగస్టు 10వ తేదీన ముగియవచ్చని సమాచారం. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


కొత్త భవనంలోనా.. ప్రస్తుత భవనంలోనా..


అయితే వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయా లేదా ప్రస్తుతం ఉన్న భవనంలోనే జరుగుతాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన మంత్రి మోదీ నెల రోజుల క్రితమే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉండగా వాటి పనులు ఇప్పటికీ సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలోనే వర్షాకాల సమావేశాలు నిర్వహించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Police Brought Electricity: దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత వృద్ధురాలి ఇంట్లో వెలుగులు నింపిన పోలీసులు


ఈ అంశాలపై ప్రతిపక్షలు పోరాడే అవకాశం


ఉమ్మడి పౌరస్మతి, అలాగే దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ లపై ప్రధానంగా వాడి వేడిగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా రోజుల నుంచి మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, వాటిపై కేంద్ర వైఖరిని గట్టిగా ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ అంశాలు పార్లమెంట్ సమావేశాలను వర్షాకాలంలో కూడా హీట్ పుట్టిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అదానీ-హిండెన్ బర్గ్ నివేదికపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial