QUAD Summit: ఇండో పసిఫిక్ రీజియన్‌లో మారిటైమ్ సెక్యూరిటీ కోపరేషన్‌కు సంబంధించి క్వాడ్‌ సదస్సులో అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. విల్మింగ్‌టన్‌లో జరిగిన వార్షిక క్వాడ్‌ సదస్సులో సభ్య దేశాలు.. దక్షిణ చైనా సముద్రంలో ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా పేరు చెప్పకుండానే.. ఆ ప్రాంతంలో సైనిక నౌకలు తిరగడం ఆ ప్రాంత పురోభివృద్ధికి విఘాతంగా పేర్కొన్నారు. క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదన్న ప్రధాని నరేంద్రమోదీ.. ప్రపంచ వ్యాప్తంగా రూల్‌ బేస్డ్‌గా నడిచే ప్రపంచం కోసమని.. ప్రతి దేశ భూభాగ సమగ్రతను కాపాడడమే లక్ష్యమని మోదీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనడం కోసం మోదీ చేసిన కృషిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రశంసించారు.


దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దుందుడుకు చర్యలను ఖండించిన క్వాడ్‌:


వార్షిక క్వాడ్ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్‌, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ తీరంలో ప్రస్తుతం ఉన్న హద్దులను మార్చడం సహా అక్కడ ఉద్రిక్తతలు రెచ్చొట్టడమే లక్ష్యంగా చైనా చేపడుతున్న సైనిక చర్యలను క్వాడ్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రతి ప్రాంతంలో ఏ దేశం మరో దేశాన్ని డామినేట్ చేయడం సహా.. లోకువ కాకుండా.. అన్ని దేశాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించడమే క్వాడ్ లక్ష్యమని.. నేతలు సంయుక్త ప్రకటన చేశారు. పూర్తీ స్వేచ్ఛాయుత, సమీకృత, సుసంపన్న ఇండో పసిఫిక్ ప్రాంతమే తమ లక్ష్యమని మోదీ పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దేశాల మధ్య యుద్ధ వాతారణం నెలకొన్న తరుణంలో జరిగిన తమ క్వాడ్ సదస్సుకు ఎంతో ప్రత్యేకమైందన్న మోదీ.. క్వాడ్ ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం వికసించేందుకు మన ప్రజాస్వామ్య విలువలు ప్రపంచానికి ఒక కరదీపికలా పని చేస్తామయని మోదీ అన్నారు. 2025 నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్రంపై నిఘానే లక్ష్యంగా క్వాడ్ ఎట్‌ సీ పేరుతో ఒక మిషన్ మొదలు పెట్టాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఇండో పసిఫిక్ మారిటైమ్ రక్షణలో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సంయుక్తంగా చేపట్టాలని తీర్మానించారు.






ఉక్రెయిన్ పరిస్థితులపై ఆందోళన.. మధ్యప్రాశ్చ్యంపై చర్చ:


ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం మిగిల్చిన నష్టంపై క్వాడ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. క్వాడ్ నేతల్లో ప్రతి ఒక్కరూ ఉక్రెయిన్‌లో పర్యటించారన్న క్వాడ్ నేతలు.. యూఎన్ చార్టర్ ప్రకారం ప్రతి దేశం సమగ్రత, సార్వభౌమత్వానికి నష్టం జరగకుండా పొరుగు దేశాలు వ్యవహించాలన్నారు.  ఉక్రెయిన్ యుద్ధం అభివృద్థి చెందుతున్న చెందాల్సిన దేశాల్లో ఆహార కొరత సహా అనేక సమస్యలను మరింతగా పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ చర్చల ద్వారా తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇదే సమయంలో ఏ దేశమైన అణ్వస్త్రాలను వాడాలనుకోవడం లేదా వాడతామని బెదిరించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. రష్యా ఉక్రెయిన్‌ మధ్య పరిస్థితులను సాదారణ స్థితికి తెచ్చేందుకు మోదీ చేసిన కృషిని ఈ సందర్భంగా బైడెన్ కొనియాడారు. మధ్యప్రాశ్చ్యం పరిస్థితులపైనా క్వాడ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన ఏకపక్ష దాడులను తీవ్రంగా ఖండించిన క్వాడ్ నేతలు.. ఇదే సమయంలో గాజాలో మారణహోమం కూడా సరైన చర్య కాదని పేర్కొన్నారు. గాజా ప్రజలకు హ్యుమానిటేరియన్ సాయం అందేందుకు అన్ని పక్షాలు సహకరించాలని సూచించారు.


Also Read: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ