Tomato Price: 


పంజాబ్ గవర్నర్ ఆదేశం..


టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కిలో ధర రూ.200 దాటింది. కొన్ని చోట్లైతే రికార్డు స్థాయిలో రూ.350 వరకూ ఎగబాకింది. ఈ ధరలతో పేద వాళ్లే కాదు. పెద్ద వాళ్లూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల సెగ పంజాబ్ రాజ్‌భవన్‌కి తగిలింది. టమాటా ధరలు పెరగడం వల్ల గవర్నర్‌ ఫుడ్ మెనూ నుంచి వాటిని తీసేశారు. తనకు టమాటాలు లేకుండానే వంట చేయాలని చెప్పారట గవర్నర్. అందుకే మెనూ నుంచి వీటిని తీసేశారు. టమాటాల వాడకం తగ్గించి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన చేశారు. అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న పంజాబ్ ప్రజలకు మద్దతుగా తానూ టమాటాల వాడకం తగ్గించినట్టు స్పష్టం చేశారు పురోహిత్. 


"ఏదైనా కూరగాయల ధర విపరీతంగా పెరిగినప్పుడు వాటి వాడకం తగ్గించుకోవాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. ఆ తరవాత ధర అదే దిగొస్తుంది. డిమాండ్ తగ్గితే ఆటోమెటిక్‌గా ధర కూడా తగ్గుతుంది. ప్రజలంతా టమాటాలకు ప్రత్యామ్నాయం చూసుకుంటారని ఆశిస్తున్నాను. నేను అందుకే తగ్గించాను. వాతావరణ పరిస్థితులు కావచ్చు, మార్కెట్‌లో అనిశ్చితి కావచ్చు...టమాటాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ వాడకం తగ్గించాలన్న నిర్ణయం నా నుంచే మొదలవ్వాలని అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం"


- బన్వరిలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్ 


యూపీ మంత్రి కామెంట్స్..


ఇటీవలే యూపీ మంత్రి ప్రతిభ శుక్లా టమాటా ధరలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోనే టమాటాలు పెంచుకోవాలని, లేదంటే వాటిని తినడం మానేయాలని అన్నారు. దీనిపై కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 


"టమాటా ధరలు పెరిగితే వాటిని ఇంట్లోనే పెంచుకోవడం అలవాటు చోసుకోండి. లేదంటే వాటిని తినడం మానేయండి. అప్పుడు వెంటనే ధరలు తగ్గిపోతాయి. టమాటాలకు బదులుగా నిమ్మకాయలు వాడుకోవచ్చు. ఏ కూరగాయ ధర పెరిగితే దాన్ని తినడం మానేయండి"


- ప్రతిభా శుక్లా, యూపీ మంత్రి


ధరలు రూ.300 దాటే అవకాశం కనిపిస్తోందని టమాటా వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ డేటా ప్రకారం.. ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో టమాటా హోన్ సేల్ కిలో రూ.203 ఉండగా.. రిటైల్ గా కిలో ధర రూ.250కి చేరుకుంది. మరో నెల రోజుల్లో కిలో టమాటా ధర రూ.300కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని అన్నారు. గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమోటా సాగు దెబ్బతింది. వీటి ప్రభావం కూడా టమాటా ధరలపై ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో టామాటా ధరలు కిలో రూ.250-260కి పెరిగాయి. ఆగస్టు 2న మదర్ డెయిరీకి చెందిన సఫల్ ఔట్ లెట్లలో కిచెన్ స్టాపుల్ కిలో రూ.259కి విక్రయించారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండిలో టమాటాలు రూ. 150-200కి విక్రయిస్తున్నారు.  


Also Read: పరువు నష్టం దావా కేసులో రాహుల్‌కి ఊరట,తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు