Rahul Gandhi Defamation Case: 


రాహుల్‌కి ఉపశమనం..


పరువు నష్టం దావా కేసులో ఎట్టకేలకు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతోనే రాహుల్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందన్న వాదనల నేపథ్యంలో సర్పోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కి ఉపశమనం కలిగించింది. కోర్టులో రాహుల్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన పూర్ణేష్ మోదీ ఇంటి పేరు "మోదీ" కాదని, అది భూటాల అని వివరించారు. అలాంటప్పుడు ఇది పరువు నష్టం కిందకు ఎలా వస్తుందని వాదించారు అభిషేక్. దేశంలో మోదీ ఇంటి పేరుతో 13 కోట్ల మంది ఉన్నారని, కానీ కేవలం బీజేపీకి చెందిన వాళ్లు మాత్రమే దీనిపై అనవసరంగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు. ఈ కేసులో కావాలనే రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష వేశారని ఆరోపించారు. ఈ కారణంగా ఆయన 8 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇదంతా కుట్ర అని వాదించారు సింఘ్వీ. ఈ కేసు కారణంగా రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారని వివరించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు...రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధించింది. రాహుల్‌కి రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి సరైన కారణమేదీ ట్రయల్ కోర్టు చూపించలేదని జస్టిస్ పీకే మిశ్రా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 




 


"ఆయన కాస్త అభ్యంతరకరంగా మాట్లాడారన్నది వాస్తవమే. పబ్లిక్‌ లైఫ్‌లో ఉండే వ్యక్తులు ప్రసంగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయినా...ట్రయల్ కోర్టు జడ్జ్ రాహుల్‌ రెండేళ్ల జైలు శిక్ష వేయడానికి కారణమేంటన్నది స్పష్టంగా చెప్పలేదు. ఇంత గరిష్ఠ శిక్ష వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. ఒక్క రోజు శిక్ష తగ్గించి వేసినా రాహుల్‌ ఎంపీ సభ్యత్వం కోల్పోయి ఉండే వారు కాదు"


- జస్టిస్ బీఆర్ గవాయ్ 


ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 


"ఈ వాదనలు పరిశీలించిన తరవాత రాహుల్‌కి గరిష్ఠ శిక్ష వేయడానికి గల కారణాలను ట్రయల్ కోర్టు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. అందుకే...రాహుల్‌ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం"


- సుప్రీంకోర్టు 




రాహుల్ వ్యాఖ్యల్ని ఉద్దేశపూర్వకంగానే తీవ్రమైన నేరంగా పరిగణించారని, ఇది బెయిలబుల్ అఫెన్స్ అని తేల్చి చెప్పారు అభిషేక్ సింఘ్వీ. 


"ఇది బెయిలబుల్ కేసు. ఆయన సమాజానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ఎవరినీ కిడ్నాప్ చేయలేదు. హత్యా చేయలేదు. అయినా ఆయన వ్యాఖ్యల్ని తీవ్రమైన నేరంగా ఎలా పరిగణిస్తారు..? రాహుల్ గాంధీ క్రిమినల్ కాదు. బీజేపీ నేతలు కావాలనే ఆయనపై ఎన్నో కేసులు పెట్టారు"


- అభిషేక్ సింఘ్వీ, రాహుల్ తరపు న్యాయవాది