Manipur Violence: 



కలకలం..


మణిపూర్‌లో మరోసారి కలకలం రేగింది. సాయుధ బలగాల క్యాంప్‌లపై ఒక్కసారిగా దాడి చేసిన ఓ వర్గం పెద్ద ఎత్తున ఆయుధాలను చోరీ చేసి తీసుకెళ్లింది. AK రైఫిల్స్‌తో పాటు ఘటక్‌ సిరీస్‌కి చెందిన తుపాకులు, 19 వేల బులెట్స్‌ ఎత్తుకెళ్లారు. బిష్ణుపూర్‌లోని బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ దోపిడీ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అల్లర్లలో చనిపోయిన వారికి సామూహిక దహన సంస్కారాలు చేసేందుకు స్థానికులు భారీ ఎత్తున చురచంద్‌పూర్‌కి ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో దాడి జరిగినట్టు సమాచారం. ఈ సమయంలోనే దాడి జరిగినట్టు తెలుస్తోంది. 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్‌, 5 MP-5 గన్స్, 16 9MM పిస్టల్స్, 25 బులెట్ ప్రూఫ్ జాకెట్స్, 124 హ్యాండ్ గ్రనేడ్‌లు ఎత్తుకెళ్లారు. సామూహిక దహన సంస్కారాలను వ్యతిరేకిస్తూ మరో వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఇది మరోసారి రాష్ట్రంలో అలజడికి కారణమైంది. కంగ్వాయ్, ఫౌగక్‌చవో ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఆర్మీతో పాటు RAF బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ దాడిలో 25 మందికి గాయాలయ్యాయి. దహన సంస్కారాలను ఆపాలని ప్రయత్నించారు భద్రతా సిబ్బంది. సామూహిక దహన సంస్కారాలపై ఇప్పటికే మణిపూర్ హైకోర్టు స్టే విధించింది. అయినా కొంత మంది కొనసాగిస్తున్నారు. అయితే...కుకీలు మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెబుతున్నారు. కేంద్రహోంశాఖతో మాట్లాడిన తరవాత దహన సంస్కారాలు ఆపేశామని చెబుతున్నారు. 


ఇండియా కూటమికి చెందిన 21 మంది నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ నేతలు మణిపూర్ అంశంపై రాష్ట్రపతికి మెమొరాండం అందించారు. ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించాలని డిమాండ్ చేశారు. అక్కడి శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని మెమొరాండంలో పేర్కొన్నట్టు వెల్లడించారు ఖర్గే. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఈ అల్లర్లపై మాట్లాడాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఇందులో భాగంగానే...రాష్ట్రపతితో భేటీ అయ్యారు. 


"ఇండియా కూటమి తరపున 21 మంది నేతలం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశాం. అక్కడి పరిస్థితేంటో ఆమెకు వివరించాం. ఇదే అంశంపై ఓ మెమొరాండం ఇచ్చాం. మహిళలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చెప్పాం. అక్కడి పునరావాస కేంద్రాలూ సరిగా లేవు. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి వివరించాం. మాది ఒకటే డిమాండ్. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మణిపూర్ హింసపై చర్చించాలి. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ చూపించాలి. మా డిమాండ్‌లను పరిశీలిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. 


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 


ఇటీవలి మణిపూర్ పర్యటనలో భాగంగా విపక్ష ఎంపీలు గవర్నర్ అనుసూయ ఉయ్‌కీని కలిశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావాలని మెమొరాండం ఇచ్చారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఏదో ఓ పరిష్కారం చూపించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ అనుసూయను కోరారు. 


Also Read: Gyanvapi Mosque Case: జ్ఞానవాపి ప్రాంగణంలో కొనసాగుతున్న సర్వే, 300 మంది పోలీసులతో భద్రత