Gyanvapi Mosque Case: 



51 మందితో సర్వే..


జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. దాదాపు 51 మంది సిబ్బందితో ఈ సర్వే జరుగుతోంది. మసీదు కమిటీ ఈ సర్వేని బైకాట్ చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఈ సర్వే అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల ASI సర్వే మళ్లీ మొదలైంది. మసీదు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది మొహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి అల్లర్లు జరగకుండా నిఘా పెడుతున్నారు. ఇద్దరు IPSలు, నలుగురు అడిషనల్‌ ఎస్‌పీలు, ఆరుగురు డిప్యుటీ ఎస్‌పీలతో పాటు 10 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 200 మంది సిబ్బంది సర్వేని పర్యవేక్షిస్తున్నారు. అయితే...ASI టీమ్‌తో పాటు మరో 16 మందికి లోపలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు అధికారులు. వీరిలో 9 మంది ముస్లింలు కాగా...7గురు హిందువులు. కానీ...ముస్లింలు లోపలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఏడుగురు హిందువులు మాత్రమే లోపలకు వెళ్లారు. దాదాపు రెండు వారాల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ఇదే విషయాన్ని ASI అడిషనల్ డైరెక్టర్ అలోక్ త్రిపాఠి వెల్లడించారు. ఈయన నేతృత్వంలోనే ఈ సర్వే జరుగుతోంది. 






షిఫ్ట్‌ల వారీగా..


ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే రెండు వారాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అయితే...సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం 5 రోజుల్లోనే పూర్తి  చేస్తామని పేర్కొంది ASI టీమ్. షిఫ్ట్‌ల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. నమాజ్‌కి ఇబ్బంది కలగకుండా మధ్యలో కాస్త విరామం ఇచ్చి విడతల వారీగా చేపట్టాలని భావిస్తున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటామని ASI అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హిందూ తరపున న్యాయవాది సుధీర్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామ మందిరంలో సర్వే చేయడానికి 7-8 నెలల సమయం పట్టిందని, జ్ఞానవాపి మసీదులో సర్వేకి ఎంత సమయం పడుతుందో చూడాలని అన్నారు. చరిత్ర సృష్టించేందుకు ఇదో తొలి అడుగు మాత్రమే అని స్పష్టం చేశారు.  Ground Penetrating Radar (GPR) టెక్నాలజీతో సర్వే జరుగుతోంది. నేలను తవ్వకుండానే 10 మీటర్ల లోతు వరకూ చొచ్చుకుని పోయి లోపల ఏముంది స్పష్టంగా చూడొచ్చు. మసీదు నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా ఈ కొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు.