Punjab spend time with their spouses: ఖైదీలు అనగానే వారిపట్ల సమాజంలో చులకన భావం ఉంటుంది. అంతెందుకు, తప్పు చేయకున్నా సరే జైలుకు వెళ్లొచ్చాడంటేనే వారిని అనుమానంగా చూస్తుంటారు. కానీ ఖైదీల కోసం పంజాబ్ జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త అందించింది. ఖైదీలకు సైతం తమ జీవిత భాగస్వామితో జైల్లోనే ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది పంజాబ్ జైళ్ల శాఖ.
జీవిత భాగస్వాముల సందర్శనకు శ్రీకారం..
తమ జీవిత భాగస్వామితో జైళ్లలో ఏకాంతంగా గడిపే ఈ కార్యక్రమానికి ‘జీవిత భాగస్వాముల సందర్శన’ అని పేరు పెట్టారు. మంగళవారం నుంచి పంజాబ్ లోని మూడు జైళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా దాదాపు రెండు గంటలపాటు ఖైదీలు జైల్లోనే తమ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపవచ్చు. సెప్టెంబర్ 20న తరణ్ లోని గోఇంద్‌వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు, నాభా జిల్లా జైలు, బఠిండా మహిళా జైల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది పంజాబ్ జైళ్ల శాఖ. ఈ విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.
వారికి మాత్రం నో ఛాన్స్..
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు మాత్రం మూడు నెలలకు ఓసారి చొప్పున 2 గంటల పాటు జీవిత భాగస్వాములతో జైల్లోనే ఏకాంతంగా గడపవచ్చు. అటాచ్డ్ బాత్‌రూం ఉన్న ప్రత్యేక గదిని ఆ దంపతులకు కేటాయించే ఏర్పాట్లు సైతం చేశారు. చాలా ఏళ్ల నుంచి జైల్లో మగ్గిపోతున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జైళ్ల శాఖ తెలిపింది. అయితే ఈ సౌకర్యాన్ని
తీవ్ర నేరాలకు పాల్పడినవారు, గ్యాంగ్‌స్టర్లు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కల్పించడం లేదని స్పష్టం చేశారు.
పంజాబ్ జైళ్లశాఖ మంత్రి హర్ జ్యోత్ సింగ్ బైన్స్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15న ఈ పరివార్ ములాఖత్ ను లూధియానా సెంట్రల్ జైలులో ప్రారంభించారు. ఇందులో భాగంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వారి జీవిత భాగస్వామితో ఏకాంతంగా కలిసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఈ విధానాన్ని అమలు చేయగా.. 21 మంది ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో ఏకాంతంగా సమయాన్ని గడిపారు. గోఇంద్‌వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో 12 మంది జంటలు, బఠిండా మహిళా జైల్లో నలుగురు, నభా జైల్లో ఐదుగురు ఖైదీలు తమ జీవిత భాగస్వామితో గడిపారని వెల్లడించారు. ఖైదీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న అనంతరం ఈ సేవల్ని మరిన్ని జైళ్లకు విస్తరిస్తామని పంజాబ్ జైళ్ల శాఖ డీజీపీ హర్ ప్రీత్ సింగ్ సిద్ధూ అన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా మరో 6 జైళ్లలో ఖైదీలు తమ జీవిత భాగస్వామితో 2 గంటలు ఏకాంతంగా గడిపేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
సత్ ప్రవర్తన కలిగిన ఖైదీల కోసం జైళ్ల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సిద్దూ ప్రశంసించారు. వారి మానసిక స్థితి, ప్రవర్తన మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని, కుటుంబంతో వారి బంధం మరింతగా బలపడుతుందన్నారు. పంజాబ్ లో మొత్తం 26 జైళ్లు ఉండగా, అందులో 10 సెంట్రల్ జైళ్లు, 6 జిల్లా జైళ్లు, 5 సబ్ జైళ్లు, రెండు మహిళా ఖైదీల కారాగారాలు, ఒకటి ఓపెన్ సెక్యూరిటీ జైలు, ఒకటి Borstal జైలు ఉన్నాయని జైళ్లశాఖ తెలిపింది.