Delhi Metro Stations: 


గోడలపై నినాదాలు..


ఢిల్లీలో ఖలిస్థాన్ మద్దతుదారులు అలజడి సృష్టించారు. మెట్రో స్టేషన్‌ల వద్ద గోడలపై యాంటీ ఇండియా స్లోగన్స్ రాశారు. "ఢిల్లీ బనేగా ఖలిస్థాన్" అని పలు చోట్ల రాశారు. దాదాపు ఐదు మెట్రో స్టేషన్‌ల వద్ద ఈ నినాదాలు కనిపించాయి. Sikhs For Justice (SFJ)కి చెందిన కార్యకర్తలే ఈ పని చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నినాదాలు కనిపించిన ప్రతి చోటా ఈ కార్యకర్తలు కనిపించారని, అందుకే వాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నామని వెల్లడించారు. పలు చోట్ల ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు రాశారు. మోదీ సిక్కులను ఊచకోత కోశారని మండి పడ్డారు. ఖలిస్థాన్ జిందాబాద్‌ అంటూ పలు చోట్ల గోడలపై పెద్దగా రాశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 8-10వ తేదీల మధ్యలో G 20 సదస్సు జరగనుంది. ఇలాంటి కీలక సమయంలో ఈ నినాదాలు కనిపించడం సంచలనమైంది. 






"G 20 సదస్సుకి సమయం దగ్గర పడుతున్న కావాలనే ఇలా అలజడి సృష్టించారు. సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) ఇలా గోడలపై స్లోగన్స్ రాసింది. దీనికి సంబంధించిన ఫుటేజ్‌ని కూడా విడుదల చేసింది. శివాజీ పార్క్ నుంచి పంజాబీ బాగ్ వరకూ చాలా చోట్ల మెట్రో స్టేషన్ల వద్ద SFJ కార్యకర్తలు కనిపించారు"


- ఢిల్లీ పోలీసులు


అప్రమత్తమైన పోలీసులు..






వీటిని గుర్తించిన వెంటనే పోలీసులు గోడలపై ఉన్న నినాదాలను తొలగించారు. ఈ ఏడాది జూన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పంజాబ్‌లోని ఫరిద్‌కోట్‌లో సెషన్స్ కోర్టు జడ్జ్ ఇంటి గోడలపైనా ఇలాంటి నినాదాలు రాశారు. అంతకు ముందు మే నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఖలిస్థాన్ మద్దతుదారులు అలజడి సృష్టించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఖలిస్థాన్ జెండాలు ఎగరేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ ఏర్పాటైంది. సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలిస్థాన్‌ని ఏర్పాటు చేయాలన్నదే వీరి డిమాండ్. ఇండియా నుంచి పంజాబ్‌ని వేరు చేయాలని డిమాండ్ చేస్తూ 2020లో ఉద్యమం మొదలు పెట్టారు.