Mann Ki Baat Highlights:
104వ ఎపిసోడ్..
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 104వ ఎపిసోడ్‌లో కీలక ప్రసంగం చేశారు. చంద్రయాన్ 3 విజయవంతం అవడాన్ని ప్రస్తావించారు. నవ భారత స్ఫూర్తికి ఇది సంకేతమని ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయం సాధించవచ్చన్న సందేశాన్ని ఈ విజయం దేశ ప్రజలకు అందించిందని వెల్లడించారు. ఇదే సమయంలో G20 గురించీ ప్రస్తావించారు. ఈ సదస్సుని దేశ ప్రజలే లీడ్ చేయనున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అన్నీ సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
"చంద్రయాన్ 3 విజయవంతం అవడాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకోవాలి. చంద్రుడిపైన ల్యాండ్ అయ్యి మూడు రోజులవుతోంది. ఇది ఘన విజయం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మిషన్ చంద్రయాన్ -3 మహిళల సాధికారతకు కూడా నిదర్శనం. ఎర్రకోట వేదికగా నేను చాలా సార్లు మహిళల సాధికారత గురించి ప్రస్తావించాను. అసాధ్యాలను సుసాధ్యం చేయడం మహిళల సామర్థ్యం. చంద్రయాన్ 3 అందుకు ఉదాహరణ. ఈ మిషన్‌లో ఎంతో మంది మహిళా సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు ఉండటం గర్వకారణం"
- ప్రధాని నరేంద్ర మోదీ
G20 సదస్సు ప్రస్తావన..
ఢిల్లీలోని G20 సదస్సు గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ...ఈ సమ్మిట్‌ని నిర్వహించేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి పదో తేదీ వరకూ ఈ సదస్సు జరగనుంది.
"G 20 సదస్సుకి మన దేశ ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇలాంటి చరిత్రాత్మక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ ఇందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. 40 దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఢిల్లీకి రానున్నారు. G20 సదస్సు చరిత్రలోనే ఇదో మైలురాయి"
- ప్రధాని నరేంద్ర మోదీ
తెలుగు భాషపై కీలక వ్యాఖ్యలు
చైనాలో జరిగిన World University Gamesలో విజయం సాధించిన ఇండియన్ ప్లేయర్స్‌కి అభినందనలు చెప్పారు ప్రధాని. ఇప్పటికే యూపీకి చెందిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. ఇదే క్రమంలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం గురించీ మాట్లాడారు. ప్రతి ఒక్క పౌరుడూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని అన్నారు. సంస్కృత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
"ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. యోగ, ఆయుర్వేదం, ఫిలాసఫీ లాంటి అంశాలపై చాలా మంది అధ్యయనం చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. సంస్కృత భాషను నేర్చుకునేందుకూ చాలా మంది ఆసక్తి చూపుతుండటం సంతోషకరం. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది. సంస్కృతం లాగానే తెలుగు కూడా పురాతనమైన భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోనున్నాం"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: మార్స్ వీనస్‌పైకి కూడా వెళ్లే సామర్థ్యం భారత్‌కి ఉంది, పెట్టుబడులు పెరగాలి - ఇస్రో చీఫ్ సోమనాథ్