Chandrayaan-3: 


కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి: సోమనాథ్ 


చంద్రయాన్ 3 ప్రయోగంతో చరిత్ర సృష్టించింది భారత్. సౌత్‌పోల్‌పైనా సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసి ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంది. భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం గగన్‌యాన్‌పై దృష్టి సారించింది ఇస్రో. ఈ క్రమంలోనే ఇస్రో చీఫ్‌ సోమ్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్రో మొత్తం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుందని అందులో చంద్రయాన్ పూర్తైందని వెల్లడించారు. రానున్న 14 రోజులు ఈ మిషన్‌లో చాలా కీలకమని చెప్పారు. మరో రెండు మిషన్స్ గురించీ ప్రస్తావించారు. భారత్‌కి చంద్రుడిపై వెళ్లే సామర్థ్యం ఉందని తేల్చి చెప్పిన సోమనాథ్...మార్స్, వీనస్‌పైకి వెళ్లే కెపాసిటీ కూడా ఇండియాకి ఉందని..కాకపోతే మరింత ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని అన్నారు. అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరాన్నీ గుర్తు చేశారు. 


"మూన్, మార్స్, వీనస్..ఈ అన్ని గ్రహాలపైకి వెళ్లగలిగే సామర్థ్యం భారత్‌కి ఉంది. కాకపోతే కాస్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అంతరిక్ష రంగంలో అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులు రావాలి. దేశమూ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఇదే మా లక్ష్యం కూడా. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కి తగ్గట్టుగా పని చేసేందుకు మేమెప్పుడూ ముందుంటాం"


- సోమ్‌నాథ్, ఇస్రో చీఫ్ 






14 రోజులు కీలకం..


చంద్రయాన్ 3 సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు సోమ్‌నాథ్. అనుకున్న లక్ష్యాలు సాధించగలిగామని వెల్లడించారు. వచ్చే 14 రోజుల్లో చంద్రుడి నుంచి కీలకమైన సమాచారం తెలుసుకోవచ్చని వివరించారు. 


"చంద్రయాన్‌ 3 సేఫ్‌ ల్యాండింగ్‌పై చాలా సంతోషంగా ఉంది. సైంటిఫిక్ డేటా అంతా మేం అనుకున్న విధంగానే అందుతోంది. అయినా ఇంకా సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. చంద్రుడి నుంచి కీలక సమాచారం తీసుకుంటాం. ఇందుకు వచ్చే 14 రోజులు చాలా కీలకం. కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకముంది. అందుకే రానున్న 13-14 రోజులు ఎలా ఉంటాయో అని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం"


- సోమ్‌నాథ్, ఇస్రో చీఫ్ 


చంద్రయాన్ 3 సేఫ్‌ ల్యాండింగ్ అవడంతో పాటు, ప్రజ్ఞాన్ రోవర్‌ అక్కడి సమాచారాన్ని సేకరించి భూమి మీదకు పంపాలన్న రెండు లక్ష్యాలతో ఈ మిషన్‌ని మొదలు పెట్టింది ఇస్రో. ఇందులో సేఫ్ ల్యాండింగ్ ఇప్పటికే పూర్తవ్వగా...ప్రజ్ఞాన్ రోవర్‌ నుంచి సమాచారాన్ని సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.