Priyanka Gandhi:
వారణాసి నుంచి పోటీ..?
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కీలక నేతలు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై మథనం కొనసాగుతోంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌లో ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ యూపీలోని అమేఠి నుంచి పోటీ చేస్తారని ఓ కాంగ్రెస్ నేత ప్రకటించారు. కాంగ్రెస్‌కి కంచుకోట అయిన అమేఠిలో 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్. ఈ సారి ఇక్కడే నిలబడి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. దీనిపైనే ఆసక్తికర చర్చ జరుగుతుండగా..ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ప్రియాంక గాంధీ ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి నుంచి పోటీ చేస్తారని ఓ కాంగ్రెస్ నేత వెల్లడించారు. కాంగ్రెస్ లీడర్ రషీద్ అల్వి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. ప్రియాంక వారణాసిలో పోటీ చేస్తే...ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కి వెళ్లిపోతారని, మళ్లీ తిరిగి రారని సెటైర్లు వేశారు. రాహుల్ అమేఠీ నుంచి పోటీ చేస్తే స్మృతి ఇరానీకి డిపాజిట్ గల్లంతవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
"రాహుల్ గాంధీ అమేఠి నుంచి పోటీ చేస్తే స్మృతి ఇరానీకి డిపాజిట్ కూడా దక్కదు. బహుశా ఆమె అమేఠి నుంచి తిరిగి వచ్చేయొచ్చు. కానీ బీజేపీకి నాదొకటే రిక్వెస్ట్. ఆమె ఎక్కడికీ వెళ్లిపోకుండా ఆపాలి. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తే...ప్రధాని మోదీ గుజరాత్‌కి వెళ్లిపోవడం ఖాయం. మరోసారి వారణాసిలో పోటీ కూడా చేయరు"
- రషీద్ అల్వి, కాంగ్రెస్ నేత
ఈ కామెంట్స్‌పై బీజేపీ గట్టిగానే స్పందించింది. కాంగ్రెస్‌కి ఓట్లు అడిగే హక్కే లేదని తేల్చి చెబుతోంది. బీజేపీ నేత తరుణ్ చుగ్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అమేఠి ప్రజలు రాహుల్‌ని ఓడించారని, మళ్లీ పోటీ చేసినా ఓడిస్తారని వెల్లడించారు.
"అమేఠిలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ఇప్పటికే ఓ సారి రాహుల్‌ని అక్కడి ఓటర్లు ఓడించారు. మళ్లీ పోటీ చేస్తే మళ్లీ ఓడిస్తారు"
- తరుణ్ చుగ్, బీజేపీ నేత
కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా స్పందించారు. అమేఠి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రైవేట్ ప్రాపర్టీగా భావించిందని విమర్శించారు.
"అమేఠి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఓ ప్రైవేట్ ప్రాపర్టీగా మాత్రమే చూసింది. ఓటర్లను చూయింగ్ గమ్‌లుగా మార్చేసింది. వాళ్లను తీవ్ర అసహనానికి గురి చేసింది. ప్రజలు వాళ్లను క్షమించరు"
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్రమంత్రి
Also Read: కేటీఎమ్ బైక్‌పై స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ, లద్దాఖ్‌లో పాంగాంగ్ లేక్ వరకూ లాంగ్ రైడ్