Rahul Gandhi Bike Ride:
రాహుల్ బైక్ రైడ్..
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన..ఆ తరవాత రాజకీయాల్ని పక్కన పెట్టేశారు. ఓ ఎంపీగా కాకుండా ఓ సాధారణ పౌరుడిగా బైక్ రైడ్ చేయాలని అనుకున్నారు. అందుకే...లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్ వరకూ బైక్‌పై వెళ్తున్నారు. తన రైడ్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్. ఇందులో ఆయన చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రో రైడర్ లుక్‌లో KTM 390 Adventure బైక్ నడుపుతున్నారు. మరి కొందరు రైడర్స్ ఆయనను ఫాలో అవుతున్నారు. హెల్మెట్, గ్లోవ్స్, రైడింగ్ బూట్స్, జాకెట్‌తో రైడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 20న రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ జయంతి. ఆయన జయంతిని పాంగాంగ్‌లో జరుపుకోవాలనేది రాహుల్ కల. అందులోనూ ఇది రాజీవ్ గాంధీకి చాలా ఇష్టమైన ప్రదేశమట. ఇదే విషయాన్ని రాహుల్ సోషల్ మీడియాలో చెప్పారు.
"పాంగాంగ్ లేక్‌కి బైక్‌రైడ్ చేస్తూ వెళ్తున్నాను. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశం అదే అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
ఆగస్టు 25 వరకూ పర్యటన..
ఆగస్టు 25వ తేదీ వరకూ రాహుల్ లద్దాఖ్‌లోనే పర్యటించనున్నారు. రాహుల్ ఫొటోలను కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది. "అన్‌స్టాపబుల్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అడ్వెంచర్ టూర్స్‌కి పనికొచ్చి KTM 390 బైక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. నిజానికి..రాహుల్ గాంధీకి ఈ బైక్ అంటే చాలా ఇష్టం. సొంతగా ఓ బైక్ కొనుక్కున్నారు కూడా. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఎప్పుడూ దాన్ని నడపలేదు. ఇటీవల ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్‌లో బైక్ సర్వీసింగ్ సెంటర్‌లో కూర్చుని మెకానిక్స్‌తో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పారు రాహుల్. తనకు బైక్ ఉన్నా సెక్యూరిటీ దాన్ని నడపనివ్వదని అన్నారు.