SpiceJet:
స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో..
ముంబయికి చెందిన స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో ఓ వృద్ధుడు ఎయిర్ హోస్టెస్‌ని దొంగ చాటుగా ఫొటోలు తీశాడు. ఇది గమనించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే నిలదీసింది. చాలా సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఓ వ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..వైరల్ అయింది. అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీసినట్టు ఎయిర్ హోస్టెస్ తీవ్రంగా ఆరోపించింది. ఫొటోలు తీస్తుండడాన్ని గమనించిన వెంటనే ఫోన్ లాక్కుని చూసింది. కాసేపు గొడవ పడిన ఆ వృద్ధుడు ఆ తరవాత సారీ చెప్పాడు. వెంటనే ఆ ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశాడు. ఆ తరవాత అపాలజీ లెటర్ కూడా రాశాడు.
"ఢిల్లీ-ముంబయి స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో మావి A,B సీట్‌లు. C సీట్‌లో ఓ వృద్ధుడు కూర్చున్నాడు. ఫ్లైట్ అటెండెంట్ ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో తన మొబైల్‌తో అసభ్యకరంగా వీడియోలు ఫొటోలు తీశాడు. ఇది గమనించి నేను వెంటనే ఆమెకి ఇన్‌ఫామ్ చేశాను. తనకు కూడా అనుమానం ఉన్నట్టు చెప్పింది. వెంటనే ఆయన ఫోన్ లాక్కుని చెక్ చేశాం. కాళ్లను వీడియో తీశాడు. ఇష్టమొచ్చిన చోట ఫొటోలు తీశాడు"
- ప్రత్యక్ష సాక్షి
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఘటనను ధ్రువీకరించింది. ఆ ప్రయాణికుడు తన ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. టేకాఫ్ అయ్యే టైమ్‌లో జంప్ సీట్‌పై కూర్చునే సమయంలో ఎయిర్‌హోస్టెస్ వీడియోలు షూట్ చేశాడని, నిలదీసిన తరవాత తన తప్పుని ఒప్పుకున్నాడని వివరించింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. లైంగిక వేధింపుల విషయంలో స్పైస్‌జెట్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యం వహిస్తోందని మండి పడింది.