Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇప్పటికీ అధికార ఎన్‌డీఏ కూటమి ఎవరిని బరిలోకి దింపుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు.
భేటీలో
మంగళవారం ఉదయం వెంకయ్య నాయుడుతో హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. దీంతో రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి. గిరి, ఆర్. వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్ నారాయణన్, జాకీర్ హుస్సేన్‌లు రాష్ట్రపతులయ్యారు. దీంతో ఇప్పుడు వెంకయ్యనాయుడుకు ఆ అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
తేలనుందా?
మంగళవారం రాత్రి 7 గంటలకు భాజపా పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని అంతా భావిస్తున్నారు.
ప్రతిపక్షాల అభ్యర్థి
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు బలంగా వినిపిస్తోంది. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా సడెన్‌గా ఆ పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
యశ్వంత్ సిన్హా ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఆయన రాష్ట్రపతి రేసులో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా నిలవడం దాదాపు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇక ఎన్‌డీఏ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి.
రాష్ట్రపతి ఎన్నికలు
2017 జులై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 24తో రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కీలక తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15
- నామినేషన్లకు చివరి రోజు: జూన్ 29
- నామినేషన్ల పరిశీలన: జూన్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 2
- పోలింగ్: జులై 18
- కౌంటింగ్, ఫలితాలు: జులై 21
- ప్రమాణస్వీకారం: జులై 25
Also Read: France Elections 2022: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు షాక్- మెజార్టీ కోల్పోయిన అధికార కూటమి
Also Read: Govt Jobs For Retired Agniveers: అగ్నివీరులకు ఆ సీఎం బంపర్ ఆఫర్- రాష్ట్రంలో ఉద్యోగాలిస్తామని ప్రకటన