Maharashtra Politics: శివసేన నేతృత్వంలోని మహారాష్ట్రప ప్రభుత్వం మహా వికాస్ అఘాడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్‌లో క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
షాక్ తప్పదా?
సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి ప్రతిపక్ష భాజపా షాక్ ఇచ్చింది. వెంటనే శివసేన ఎమ్మెల్యేలు కొంతమంది గుజరాత్‌కు చేరుకోవడం మరో పెద్ద షాక్‌గా మారింది. వీరు గుజరాత్‌కు చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేతో 10-12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌లోని ఓ హోటల్‌లో క్యాంప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే సోమవారం నుంచి పార్టీకి అందుబాటులో లేరని తెలుస్తోంది.
భారీగా క్రాస్ ఓటింగ్
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. పది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార మహా వికాస్ అఘాఢికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష భాజపా ఐదుస్థానాల్లో గెలుపొందింది. శివసేన, ఎన్‌సీపీ పార్టీలు చెరో రెండు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది.
ఇది మధ్యప్రదేశ్ కాదు
ఈ పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో శివసేన సర్కార్‌ను కూలదోయాలని భాజపా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అయితే అలా జరగడానికి ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాదని భాజపా గుర్తించుకోవాలని హెచ్చరించారు. ఏక్‌నాథ్ షిండేతో పాటు మిగిలిన శివసేన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారన్నారు.