Droupadi Murmu: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. మూడు రంగుల జాతీయ జెండాను చూస్తే హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ప్రపంచ పటంలో భారత్‌ నేడు సముచిత స్థానంలో ఉందన్నారు. దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వివరించారు. భారత్‌.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు.


రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది మనందరికీ  శుభ సందర్భం. స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటడం చూసి నా ఆనందానికి అవధుల్లేవు. నగరాలు, గ్రామాలు తేడా లేకుండా చిన్నా, పెద్దా, పిల్లలు, యువత, వృద్ధులు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు జెండా పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతుండడం చూడటం సంతోషంగా ఉంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌‌ను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.’ అని ప్రసంగించారు


'అన్నదాతలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధిపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఉంది. యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంలో ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చాం. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం'  అని అన్నారు.


‘ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి, మానవతా లక్ష్యాలను ప్రోత్సహించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. G-20 అధ్యక్ష పదవిని కూడా చేపట్టింది. దీంతో భారతదేశం వాణిజ్యం, ఫైనాన్స్‌లో నిర్ణయాధికారాన్ని సమానమైన పురోగతి వైపు నడిపించగలదు. వాణిజ్యం, ఆర్థిక అంశాలకు అతీతంగా, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. భారతదేశపు నాయకత్వంతో, సభ్య దేశాలు అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని విశ్వసిస్తున్నాను.’


‘మన దేశ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆర్థిక సాధికారతపై దేశంలో ప్రత్యేక దృష్టి సారించడం పట్ల నేను సంతోషపడుతున్నాను. ఆర్థిక సాధికారత వల్ల కుటుంబంలో సమాజంలో మహిళల స్థానం బలోపేతం అవుతోంది. చంద్రయాన్‌-3 జాబిల్లిపై అడుగుపెట్టే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్‌ ఉండాలి. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది’


స్వాతంత్య్ర పోరాటంలో మహిళల కృషి ఆదర్శం. భారత స్వాతంత్ర సమరంలో కస్తూరాబా గాంధీ, మహత్మాగాంధీ వెంట నడిచింది. ఇప్పుడు మహిళలు దేశాభివృద్ధిలో అన్నివిధాలుగా పాలు పంచుకుంటున్నారు.  ఈ దేశంలో పౌరులు అందరూ సమానులే. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయి.’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.


గ్యాలంటరీ పతకాలకు ఆమోదం
ఈ ఏడాది 76 గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. నలుగురు కీర్తి చక్ర పురస్కారాలు, 11 మంది శౌర్యచక్ర పురస్కారాలు అందుకోనున్నారు. 52 మందికి సేనా పతకాలు, ముగ్గురికి నౌకా సేన ముగ్గురు, నలుగురికి వాయుసేన పతకాలు అందించనున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial