Independence Day 2023: ఎందరో వీరుల త్యాగఫలం నేడు భారతావని అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. భారతదేశ స్వాతంత్య్రానికి, 200 ఏళ్ల పోరాటం ద్వారా సంపాదించుకున్న స్వేచ్ఛకు గుర్తు మూడు రంగుల జాతీయ పతాకం. త్రివర్ణ పతాకం అనేది కేవలం జెండా కాదు. అది దేశ ఆత్మగౌరవానికి గుర్తు. భారత సార్వభౌమత్వానికి చిహ్నం. జెండా భారత దేశ ఐక్యతను, సమగ్రతను సూచిస్తుంది. 


జెండాలోని మూడు రంగులు మూడు భావాలను సూచిస్తాయి. పైన ఉండే కాషాయ రంగు ధైర్యానికి, త్యాగాన్ని సూచిస్తుంది. మధ్యలో తెలుపు వర్ణం శాంతికి, సత్యానికి, స్వచ్ఛతను సూచిస్తుంది. చివరగా కింద ఉన్న ఆకుపచ్చ రంగు దేశం వృద్ధిని, పంటలను సూచిస్తుంది. మువ్వన్నెల జెండా  మధ్యలోని చక్రాన్ని ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. దీనిని చక్రవర్తి అశోకుడి సింహ రాజధాని నుండి తీసుకున్నారు. ఇందులో 24 ఆకులు ఉంటాయి. 


ఎవరైనా జెండా గౌరవానికి భంగం కలిగించడం అనేది శిక్షార్హమైన నేరం. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలి. జాతీయ జెండాని ఆవిష్కరించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారమే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి. మువ్వన్నెల జెండా గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రవర్తించడం ప్రతీ భారతీయుడి కర్తవ్యం. జెండాను ఆవిష్కరణలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఎలాంటి ఆ నియమాలు ఏంటి? వాటిని ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఏం చేయొచ్చంటే



  • జెండా పరిమాణం 2:3 నిష్పత్తిలో ఉండాలి.

  • జెండాను తలకిందులుగా ఆవిష్కరించకూడదు.

  • కాషాయ రంగు పైభాగంలో ఉండాలి. ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఉండాలి.

  • చుట్టుపక్కల జెండాలతో పోలిస్తే జాతీయ జెండా ఎత్తు ఎక్కువగా ఉండాలి.

  • ఇతర జెండాల సమూహంలో కలిసిపోయేలా జాతీయ జెండాను ఉంచకూడదు.

  • భారత పౌరులందరికి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు ఉంది.

  • జెండాను ఎగురవేసే వారు గౌరవప్రదమైన దుస్తులు ధరించాలి.

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు, అవనతం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వందనం చేయాలి.

  • అవనతం చేసినప్పుడు పతాకాన్ని త్రిభుజాకారంలో మడిచి, గౌరవప్రదంగా నిల్వ చేయాలి.

  • వేదికల మీద, గోడలపై చిత్రీకరించే సమయంలో కూడా కాషాయ రంగు పైనే ఉండేలా చూసుకోవాలి.

  • జెండా ఇక ఆవిష్కరించలేని విధంగా చిరిగిపోయినా, వెలిసిపోయినా ఒక పెట్టెలో పెట్టి ఎవ్వరూ చూడకుండా భూమిలో పాతిపెట్టాలి.


ఇవి చేయకూడదు



  • జెండాపై కాలు, అడుగు పెట్టకూడదు. 

  • నేలను, నీటిని జాతీయ పతాకం తాకకుండా చూడాలి.

  • జెండాపై ఏవిధమైన నినాదాలు, పదాలు రాయకూడదు.

  • చిరిగిపోయిన, వెలిసిపోయిన జెండాను ఆవిష్కరించకూడదు.

  • జాతీయ జెండా కంటే ఎత్తుగా మరే ఇతర జెండానూ ఉంచకూడదు.

  • త్రివర్ణ పతాకాన్ని ఎక్కడైనా అలంకారం కోసం ఉపయోగించకూడదు.

  • చేతి రుమాలుగా, టేబుల్‌ క్లాత్‌గా ఉపయోగించరాదు. అలా చేస్తే శిక్షార్హం

  • బహిరంగంగా అందరూ చూస్తుండగా జెండాకు నిప్పు పెట్టడం, కించపరిచేలా మాట్లాడడం నేరం

  • వాహనాలపై కప్పే వస్త్రంగా జాతీయ జెండాను ఉపయోగించకూడదు. అలా చేస్తే నేరం అవుతుంది.

  • జెండా స్తంభంపై  చివరన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి. స్తంభం సగం వరకు ఎగరేయకూడదు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial