Global Approval Ratings PM Modi | న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత నమ్మదగిన నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ లో భారత ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. 75 శాతం ఆమోదం రేటింగ్ తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన, నమ్మకమైన నాయకుడిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ లను ట్రాక్ చేసే గ్లోబల్ సర్వేలో, ప్రధాని మోదీ ఇతర నేతల కంటే చాలా ముందున్నారు. వీరిలో యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44% ఆమోదం రేటింగ్ తో కనీసం టాప్ 5 నమ్మదగిన నేతల జాబితాలోనూ చోటు దక్కించుకోలేకపోయారు. 


టాప్ 5లో నిలిచిన నేతలు వీరే..


ప్రధాని మోదీ 75 శాతంతో అత్యధిక ఆమోదం పొందారు. ఇతర ప్రపంచ దేశాల నాయకుల కంటే గణనీయమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. మోదీ తరువాత దక్షిణ కొరియాకు చెందిన లీ జే-మ్యుంగ్ 59 శాతం, అర్జెంటీనాకు చెందిన జేవియర్ మైలీ 57 శాతం, కెనడాకు చెందిన మార్క్ కార్నీ 56 శాతం ఆమోదంతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ 54 శాతం ఆమోదం రేటింగ్ తో టాప్ 5గా నిలిచారు.


మెక్సికో నూతన అధ్యక్షుడు క్లాడియా షెయిన్బామ్ 53 శాతం, స్విట్జర్లాండ్ కు చెందిన కారిన్ కెల్లర్ సట్టర్ 48 శాతం ఆమోదంతో ఉన్నారు.  ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44 శాతంతో 8వ స్థానంలో నిలిచారు.






ప్రపంచ దేశాల నేతలపై రేటింగ్స్..


యు.ఎస్ ఆధారిత విశ్లేషణ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచ నాయకులపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు డజనుకు పైగా దేశాలలో రోజువారీ పోలింగ్ నిర్వహిస్తుంది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ప్రధాని మోదీ స్థిరమైన పనితీరు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆయన స్థిరమైన ప్రజాదరణను ఈ సర్వే నిరూపించింది.


గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్


బీజేపీ జాతీయ సమాచార & సాంకేతిక విభాగం ఇంచార్జ్ అమిత్ మాలవీయ దీనిపై స్పందించారు. "ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయులు ప్రధాని మోదీని ప్రేమిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆయనను గౌరవిస్తున్నారు. దాంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ లో నెంబర్ 1గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రేటింగ్, అత్యంత నమ్మకమైన నాయకుడుగా మోదీ నిలిచారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉంది."


 ప్రధాని మోదీ భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిని చేరుకున్న సమయంలో ఈ సర్వే బయటకు వచ్చింది. భారత్‌లో  అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. జూలై 25, 2025 నాటికి, మోదీ 4,078 వరుస రోజులు ప్రధానిగా ఉన్నారు. దాంతో  జనవరి 1966 నుంచి మార్చి 1977 మధ్య 4,077 రోజులు ఈ పదవిలో ఉన్న ఇందిరా గాంధీ రికార్డును మోదీ అధిగమించారు. 6,130 రోజులు పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే పదవీకాలంలో మోదీ కంటే ముందున్నారు.