అహ్మదాబాద్: విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం చేసుకోవడం తల్లిదండ్రులకు కష్టతరంగా మారింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. నవరంగ్‌పురాలోని సోమ్ లలిత్ పాఠశాలకు చెందిన 16 ఏళ్ల టెన్త్ క్లాస్ విద్యార్థిని గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్ నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కీ చైన్ తిప్పుడూ కూల్‌గా కనిపించిన విద్యార్థిని
ఈ సంఘటన స్కూల్‌లో ఇంటర్వెల్ సమయంలో జరిగింది. అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా కనిపించిన బాలిక చేతిలో కీ చైన్ పట్టుకుని తిప్పుతూ వెళుతోంది. ఒక్కసారిగా సైడ్ నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. బాలిక ఆత్మహత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. CCTV ఫుటేజ్‌లో ఆమె కిందకు దూకడం కనిపిస్తోంది. విద్యార్థిని అలా కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్కూల్లో గందరగోళం నెలకొంది. తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ఆమెను కాపాడాలని తోటి విద్యార్థులు ప్రయత్నించారు..
స్కూల్ మేనేజింగ్ ట్రస్టీ ప్రజ్ఞేష్ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలిక గత ఐదు సంవత్సరాలుగా సోమ్ లలిత్‌లో చదువుతోంది. అయితే ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులు తమ క్లాస్ రూముల నుండి బయటకు వచ్చారు. అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా కనిపించిన టెన్త్ క్లాస్ విద్యార్థిని కీ చైన్ తిప్పుతూ వెళ్తూ ఒక్కసారిగా ఆగింది. ఆమె పారాపెట్ వైపు వెళ్లడాన్ని గమనించి కొంతమంది విద్యార్థులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. ఒకరు ఆమె చేయి పట్టుకునేందుకు చూస్తుండగా, సిబ్బందికి సమాచారం అందేలోపే విద్యార్థిని కిందకు దూకేసింది అని ఆయన తెలిపారు.
కిందకు దూకిన బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖ్యంగా తలకు తీవ్రమైన గాయమైంది. కొన్ని ఎముకలు విరిగాయి. విద్యార్థినిని వెంటనే చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను మరొక ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా గురువారం రాత్రి 10 గంటలకు విద్యార్థిని మరణించింది.
కొన్ని రోజులుగా విద్యార్థినికి అనారోగ్య సమస్యలు
నెల రోజులపాటు లాంగ్ మెడికల్ లీవ్ తరువాత ఆ విద్యార్థిని 15 రోజుల కిందటే స్కూల్‌కు తిరిగి వచ్చింది. ఆమె అనారోగ్య సమస్యల గురించి విద్యార్థిని తల్లిదండ్రులకు తెలుసునని పాఠశాల అధికారులు వెల్లడించారు. సంఘటన జరిగిన రోజు టెన్త్ క్లాస్ విద్యార్థిని బాధగా కనిపించిందని, తరగతి గదిలో గట్టిగా అరిచిందని ప్రిన్సిపాల్ లీనా అరోరా పోలీసులకు తెలిపారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు కేసు నమోదు చేసినట్లు నవరంగ్‌పురా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఎ. దేశాయ్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆమె తల్లిదండ్రులతో పాటు స్కూల్ సిబ్బందని ప్రశ్నించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, విద్యార్థిని ఇటీవల స్కూల్‌కు తిరిగి రావడానికి ముందు కొన్నిరోజుల పాటు క్లాసులకు హాజరుకాలేదని, లాంగ్ లీవ్ లో ఉందన్నారు. మృతురాలు నరన్‌పురా నివాసి, కాగా కేసు దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయని చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్యతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.