PM Modi aboit India UK Trade Agreement | తూత్తుకూడి: విదేశీ పర్యటనలు ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరిగొచ్చారు. బ్రిటన్,  మాల్దీవుల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ శనివారం (జూలై 26, 2025)న తమిళనాడు చేరుకున్నారు. తమిళనాడులోని తూత్తుకూడిలో ఆయన 4,900 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టులలో కొత్త టెర్మినల్, హైవేలు, పోర్ట్, రైల్వే అభివృద్ధితో పాటు విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.

'భారత్‌పై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని చాటే FTA'

తమిళనాడుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్ పోర్టులో పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu), పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 4 రోజుల పర్యటన తర్వాత శ్రీరాముడి పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (UK India Agreement) కుదుర్చుకున్నట్లు తెలిపారు. FTA అనేది భారతదేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని, భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుందని మోదీ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. "నేడు తమిళనాడు ప్రజలకు రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను అంకితం చేశాము. దాదాపు 2,500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రోడ్లు చెన్నైని 2 ప్రధాన అభివృద్ధి ప్రాంతాలకు కలపనున్నాయి. తూత్తుకూడి పోర్ట్ కనెక్టివిటీ కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం మెరుగువుతుంది. దాంతో పాటు వాణిజ్యం, కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుంది." అన్నారు.

ఉగ్రవాదులకు నిద్ర కరువు చేస్తున్న మన ఆయుధాలు

ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ, "నేడు భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా (Make In India), మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై చాలా దృష్టిసారించింది. మీరు ఆపరేషన్ సింధూర్ సమయంలో మేక్ ఇన్ ఇండియా బలాన్ని, సామర్థ్యాన్ని చూశారు. ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపేందుకు మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. మన దేశంలోనే తయారు చేసిన ఆయుధాలు ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి."

"నేడు, మేము ఇక్కడ మా చర్యలతో అభివృద్ధి చెందిన తమిళనాడు, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నాము. బ్రిటన్, భారతదేశం మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్ని చేకూరుస్తుంది. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి అవకాశంగా మలుచుకుంటాం" అన్నారు.

'తమిళనాడు అభివృద్ధి మాకు చాలా ముఖ్యం'

తూత్తుకుడిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "మౌలిక సదుపాయాలు, శక్తి ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక లాంటిది. గత 11 సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు, ఎనర్జీ రంగాలపై మేం దృష్టి సారించడం తమిళనాడు అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది. నేటి అన్ని ప్రాజెక్టులు తూత్తుకూడి, తమిళనాడును కనెక్టివిటీ, మెరుగైన ఎనర్జీ, కొత్త అవకాశాలకు కేంద్రంగా మార్చుతాయి" అని దీమా వ్యక్తం చేశారు.