Petrol Diesel Prices Cut in India: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.2 తగ్గించినట్లుగా కేంద్ర చమురు శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేస్తూ.. ఈ తగ్గింపు ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు కొద్ది వారాల ముందు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది.


‘‘పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2 తగ్గించడం ద్వారా, దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యం కోసం ఎల్లప్పుడూ ప్రధాని మోదీ పని చేస్తున్నట్లుగా మరోసారి నిరూపించారు” అని కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు. ‘‘మార్చి 14, 2024 రూపాయి విలువ ప్రకారం.. భారతదేశంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున రూ.94 అయితే ఇటలీలో రూ.168.01గా ఉంది. అంటే 79 శాతం ఎక్కువ, ఫ్రాన్స్‌లో రూ.166.87గా ఉంది. అంటే 78 శాతం ఎక్కువ, జర్మనీలో రూ.159.57, స్పెయిన్‌లో రూ.145.13 గా ఉంది” అని కేంద్ర మంత్రి పోస్ట్ లో పేర్కొన్నారు.