Mamata Banerjee Injured: పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ముఖానికి బలమైన గాయమై రక్తం కూడా కారిన ఒక ఫోటోను త్రుణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. ఆమె తన ఇంటి ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా కిందపడి తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. వెంటనే మమతను ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించినట్లుగా త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ విడుదల చేసిన ఆ ఫోటోలో మమత బెనర్జీ నుదుటికి బలమైన గాయం కాగా.. రక్తం ధార లాగా కారింది. చికిత్సలో భాగంగా కుట్లు వేయనున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. త్రుణమూల్ యొక్క ఎక్స్ ఖాతాలో మమత బెనర్జీ నుదుటికి దెబ్బ తగిలిన ఫోటోను పోస్ట్ చేశారు. 


ముఖ్యమంత్రి మమత గురువారం కాళీఘాట్ నివాస ఆవరణలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే పడిపోయాడు. ముందుకు పడడం వల్ల నుదిటిపై గాయాలు అయినట్లు తెలిసింది. ఆసుపత్రి వర్గాల ప్రకారం.. మమత గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. ఆమెకు సీటీ స్కాన్ కూడా చేసినట్లుగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు బంగాల్ కు చెందిన అగ్ర వార్తా సంస్థ ఆనంద బజార్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి మమత వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.